Sunday, January 19, 2025

సాహసోపేత బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేకపోయినప్పటికీ, రుణాల సేకరణకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నప్పటి రాష్ట్ర ప్రజల కలలు, ఆశలను నెరవేర్చేందుకు వీలుగా ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బంగారు తెలంగాణ కలలను సాకారం చేసేందుకు వీలుగా అభివృద్ధి-సంక్షేమ పథకాలకు రికార్డుస్థాయిలో నిధులను కేటాయిస్తూ ఆర్ధిక నిపుణులను సైతం విస్తుగొలిపే విధంగా సోమవారం అసెంబ్లీలో ఆర్ధికశాఖామంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే విధంగా దళితబంధు, రైతుబంధు వంటి సంచలనం సృష్టించిన పథకాలకు భారీగా నిధులను కేటాయించారని, కానీ ఈ పథకాలకు కేటాయించిన నిధులనే సమీకరించుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించుకొన్న మార్గాలు మాత్రం సాహసోపేతంగానే ఉన్నాయని పలువురు ఆర్ధికవేత్తలు అంటున్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను కలిపి మొత్తం 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టారు.

వచ్చే ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఖజానాకు రాబడి మాత్రం 2,89,772 కోట్ల 65 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అంటే 2023-24వ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 623 కోట్ల 35 లక్షల రూపాయల నికర లోటు ఏర్పడవచ్చునని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. అయితే రెవెన్యూ రాబడుల కంటే ఖర్చు తక్కువగా ఉంటుందని, దాంతో ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 4,881 కోట్ల 74 లక్షల రూపాయల రెవెన్యూ మిగులు ఏర్పడుతుండవచ్చునని బడ్జెట్‌లో అంచనా వేశారు. అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే ప్రణాళికా వ్యయం కింద 37,524 కోట్ల 70 లక్షల రూపాయలను కేటాయించారు. ఏడాది ముగింపు దశకు చేరుకునే సరికి ద్రవ్యలోటు మాత్రం 38,234 కోట్ల 94 లక్షల రూపాయలు ఉంటుందని ఆర్ధికశాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీని పెంపొందించడం కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం కోసం సోషల్ సర్వీస్ రంగాలకు రికార్డుస్థాయిలో 102280 కోట్ల 53 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. అదే విధంగా ఎకనమిక్ సర్వీసెస్ రంగాల్లో 58,787 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది.

ఇప్పటి వరకూ సేకరించిన బహిరంగ రుణాలకు తిరిగి చెల్లింపులు 12,706 కోట్లు కేటాయించగా లోన్లు-అడ్వాన్స్‌లకు చెల్లింపులకు మరో 28,479 కోట్ల రూపాయలను కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఖజానాకు నిధులను రాబట్టుకోవడానికి నిర్దేశించుకొన్న లక్షాలు, మార్గాలే చర్చనీయంశమయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాల నుంచి 2,16,566 కోట్ల 97 లక్షల రూపాయల నిధులు వస్తాయని అంచనా వేసిన ఆర్ధికశాఖ రెవెన్యూ వ్యయం మాత్రం 2,11,685 కోట్లు ఉంటుందని, దాంతో రెవెన్యూ మిగులు 4,881 కోట్ల 74 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ రుణాల సేకరణతో ఏకంగా 46,317 కోట్ల 68 లక్షల రూపాయలను సేకరించుకోవాలని లక్షంగా పెట్టుకొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం సహకరిస్తుందా? లేదా? అనేదే ఆందోళనకరంగా ఉందని కొందరు ఆర్ధికశాఖాధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం జిఎస్‌డిపిలో తెలంగాణ రాష్ట్ర అప్పులు 23.8 శాతం ఉన్నాయని, ఈ నేపధ్యంలో తెలంగాణపై ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు రుణాల సేకరణకు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3,57,059 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని వార్షిక బడ్జెట్‌లో ఆర్ధికశాఖ పేర్కొంది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రుణాల సేకరణ పరిమితి 20 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ రాష్ట్ర అప్పులు 23.8 శాతం ఉన్నాయని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3.8 శాతం దాటినందున ఈ ఒక్క కుంటిసాకును చూపించి కేంద్రం రుణాల సేకరణకు గండికొడుతుందేమోనని ఆ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంజాబ్, జమ్ము-కాశ్మీర్ వంటి రాష్ట్రాలు రికార్డుస్థాయిలో 46 శాతం నుంచి 54 శాతం వరకూ అప్పులు చేసినప్పటికీ అనుమతులు ఇస్తూ వస్తున్న కేంద్రం కేవలం తెలంగాణ రాష్ట్రంపై కక్షసాధింపు దోరణితో వ్యవహరిస్తూ రుణాల సేకరణకు గడచిన ఏడాది కాలంగా అనేక ఆంక్షలు విధిస్తూ వస్తున్న కేంద్రం రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఓట్ల కోసమైనా కేంద్రం సహకరిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని అంటున్నారు.

రుణాల సేకరణ విషఁంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలకు సహకరించినట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా సహకరిస్తే ద్రవ్యలోటు కూడా లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే ఎక్కువగానే ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని ఆ అధికారులు వివరించారు. ఇదిలావుండగా అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకొని మరో 17,828 కోట్ల రూపాయల నిధులను రాబట్టుకొంటామని రాష్ట్ర ఆర్ధికశాఖ లక్షంగా పెట్టుకొంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని, కొత్త ఆర్ధిక సంవత్సరంలోనైనా వివాదాలను పరిష్కరించుకొని తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలను ఇస్తుండవచ్చునని ఆర్ధికశాఖాధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు విద్యుత్తు బకాయిల రూపంలో సుమారు 12 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, అంతేగాక 9వ షెడ్యూలు, 10వ షెడ్యూలు సంస్థలు, వాటి ఆస్తుల పంపకాల సమస్యలను పరిష్కరించడం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణకు రావాల్సి ఉందని వివరించారు. అంతేగాక రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పొరపాటు మూలంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన 495 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వస్తాయని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇలా నిధుల సేకరణకు నిర్దేశించుకొన్న లక్షాలు, ఎంచుకొన్న మార్గాలన్నీ సత్ఫలితాలను ఇస్తే తప్పకుండా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలు, కలలను నెరవేరుస్తుందని ఆర్ధికవేత్తలు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News