మెదక్: ఇచ్చిన మాట ప్రకారం లక్ష రుణమాఫీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “23న ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభించడానికి వస్తున్నారు. సమీకృత కార్యాలయ సముదాయాన్ని కూడా ప్రారంభిస్తారు. కొన్ని రాష్ట్రాల నుంచి అధికారులు, మంత్రులు వచ్చి చూడటం జరిగింది. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో సమస్యలు పరిష్కారించుకోవచ్చు. మన సంక్షేమ పథకాలు చెప్పినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోయారు. మెదక్ కు రైలు ఉహించలేము.. సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడంతోనే రైలు కల నెరవేరింది. మెదక్ కు మెడికల్ కళాశాల వస్తదని కలలో కూడా అనుకోలేము. మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయాయి. 23న పండుగ లాగా విజయవంతం చేయాలి. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పాలి. యావత్ మెదక్ జిల్లా ప్రజలు వచ్చి కృతజ్ఞతలు చెప్పి విజయవంతం చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉంటుంది..ఈ సభ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ. 9 ఏండ్లలో ఇంత అభివృద్ధి జరగటం కేసీఆర్ విజన్. కేసీఆర్ ను ఆశీర్వదించాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి లది మేకపోతు గాంభీర్యం. మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ లు కేసీఆర్ ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీ. నాలుగు లక్షల ఎకరాల్లో పొడు పట్టాలు ఇచ్చాం. 1.50 లక్షల కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చాం. 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. ప్రతి రైతుకు రుణ మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.. మేము ఆచరిస్తాం. రుణమాఫీ చివరి రూపాయి వరకు చెల్లిస్తాం. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు బేజారు అవుతున్నారు. దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించడంలో మేము పోటీపడుతున్నాం. కెసిఆర్ ను తిట్టడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. బీజేపీ క్యాడర్ కోసం వెతుకులాడుతున్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. 204 మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశాం. మైనార్టీలకు కాంగ్రెస్ ఒక్కరూపాయి ఇవ్వలేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా వేలాది మంది విదేశాల్లో చదువుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ 9 ఏండ్లలో 10 వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసింది. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను అధికారికంగా చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే. కోటి రూపాయలు షాదీఖానకు మంజూరు చేస్తాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.