Saturday, November 16, 2024

రేవంత్.. ఇదిగో రాజీనామా లేఖ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్ వద్దకు వచ్చానని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సిఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే, రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని అన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, హామీల అమలుపై సిఎం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎంఎల్‌సి శంభీపూర్ రాజుతో హరీశ్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు.

మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు
సిఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పిఎ లేదా సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను : హరీశ్‌రావు
కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు వెల్లడించారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. అవ్వా తాతలకు రూ.4 వేల పింఛన్ రావాలని, వడ్లకు మొక్కజొన్నకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతుబంధు 15 వేలు వేయాలని డిమాండ్ చేశారు. ఇవేవీ తాము కొత్తగా అడుగుతున్న డిమాండ్లు కావని కాంగ్రెస్ నేతలే స్వయంగా బాండు పేపర్లు రాసిచ్చినవి అని, వంద రోజుల్లోగా వీటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు.

స్పీకర్ ఫార్మాట్‌లోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని సోనియాంగాంధీ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు గుర్తు చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగస్ట్ 15 తేదీలోపైనా అన్ని హామీలు అమలు చేస్తే సంతోషం అని వ్యాఖ్యానించారు. తన ఒక్కడి ఎంఎల్‌ఎ పదవికంటే రూ.4 వేల ఆసరా పింఛన్, రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళకు రూ.2500 రావడం, రూ.2 లక్షల రుణామాఫీ జరగడం ముఖ్యం అని పేర్కొన్నారు. తాను ఐదేళ్లు పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకంటే సంతోషమేముందని హరీష్ రావు అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News