Monday, March 17, 2025

బిసి రిజర్వేషన్ల బిల్లుకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్ల బిల్లుకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. బిసిలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బిసిలు సంతోషిస్తారని అన్నారు. ఈ అంశంపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానానికి, పార్లమెంట్‌లో పోరాటానికి బిఆర్‌ఎస్ కలిసి వస్తుందన్నారు. బిసి రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఓటేస్తామని చెప్పారు. బిల్లుపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని హరీష్‌రావు కోరారు. గతంలో కెసిఆర్ ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్‌లో, డైరెక్టర్లలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ తెచ్చింది బిఆర్‌ఎస్ పార్టీ అని గుర్తు చేశారు.

మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడాలేని విధంగా గౌడన్నల కోసం బిఆర్‌ఎస్ పార్టీ మద్యం షాపుల్లో రిజర్వేషన్ తెచ్చిందని తెలిపారు. బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన మూడు అంశాలను బేషజాలకు పోకుండా చేర్చాలని కోరారు. బిసిలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బిసిలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలని అన్నారు. బిసి బిల్లు ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇచ్చిన మాట ప్రకారం బిసి సబ్‌ప్లాన్‌ను చేర్చాలని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 20,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News