మన తెలంగాణ/సిద్దిపేట :మెడికల్ కాలేజీల ఏర్పాటుపై బిజెపి నాయకుల పరిస్థితి చూస్తేంటే మందికి పుట్టిన బిడ్డ మాదే అన్నట్లు కనిపిస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బిజెపిపై ఫైర్ అయ్యారు. నేషనల్ మెడికల్ కమిషన్ 9 ప్రభుత్వ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని అదే విధంగా 4 నాలుగు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇ చ్చిందన్నారు. అదికూడా ఎన్‌ఎంసి అటానమస్ బాడి అని, అన్ని ఉన్నాయో, లేదో అర్హతలు చూసి అనుమతి ఇస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ కాలేజీలతోపాటు నాలుగు ప్రైవేటు కాలేజీలకు మేమే అనుమతి ఇచ్చామని బిజెపి నాయకులు డప్పు కొడుతుండటం సిగ్గుచేటన్నా రు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంక్షేమ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రూ.500 కోట్లతో మేము ఒ క్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, రాత్రింబవళ్లు కష్టపడితే మేమే ఏర్పాటు చేశామనడం ఎంత దుర్మార్గం, ఎంత దారుణమన్నారు. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు ఒక్క బిజెపికే సాధ్యమని హరీశ్‌రావు ధ్వజమెత్తా రు. ఇందులో ప్రధాని పాత్ర ఏంటి, మన్సూ క్ మాండవీయ పాత్ర ఏంటి అని హరీశ్‌రా వు నిలదీశారు. బిజెపి సర్కార్ దేశ వ్యాప్తం గా 157 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇచ్చిన పాపానపోలేదన్నారు.
మేమే కాలేజీలు పెట్టామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నాడని ఏనాడైనా కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ కావాలని మాట్లాడారా లేదంటే దరఖాస్తు పెట్టాడా? మేమే పెట్టాం అనటానికి కొద్దిగైనా సిగ్గు ఉండాలని ఉండాలని హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన ఒక్క ఎయిమ్ దిక్కులేదు. మేం తెచ్చుకున్న 21 మెడికల్ కాలేజీలు మాయే అన్నట్లు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారన్నారు. చేయని దానిని చేసినాం అని చెప్పుకుంటున్నందుకు తలదించుకొని బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. బిజెపి నాయకులకు దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ తదితర వాటిని తెచ్చేందుకు రాష్ట్ర బిజెపి నాయకులు
కేంద్రంపై ఒత్తిడి తేవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలు ఎప్పుడూ లేని విధంగా సిఎం కెసిఆర్ పాలనలో ప్రజలు స్వర్ణయుగాన్ని చూస్తున్నారన్నారు. బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నయా అని ప్రశ్నించారు. బిజెపి అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక అబద్ధ్దపు ప్రచారాలకు పాల్పుడుతున్నారని మండిపడ్డారు. అదే సిఎం కెసిఆర్ ఈ తొమ్మిదేళ్ల పాలనలో 21 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణకు సంబంధించిన పూర్తి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తుందన్నారు. బిజెపి, కాంగ్రెసోళ్లు చేస్తున్న గ్లోబల్ ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. ప్రజలు మహారాష్ట్రలో పర్యటిస్తే బిజెపి పాలన, సిఎం కెసిఆర్ పాలన ఎలా సాగుతుందో స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు.
ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పై 59 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌పై 11 వేల 131 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యా క్షేత్రంగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్వచ్ఛ సిద్దిపేటలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. సిద్దిపేట అంటేనే గౌరవం పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్స్‌ర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్ధాయిలో తగ్గించాలన్నారు. అనంతరం పది రకాల సంక్షేమ పథకాలను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, ప్రజాప్రతినిధులు,నాయకులు కడవేర్గు రాజనర్సు, జంగిటి కనకరాజు, కొండం సంపత్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, వజీరోద్దిన్, మొయిస్, శ్రీహరియాదవ్, బ్రహ్మం, కెమ్మసారం ప్రవీన్‌కుమార్, సద్ది నాగరాజు రెడ్డి, మల్లికార్జున్ , సాకి ఆనంద్ , అరవింద్ రెడ్డి , సాయి గౌడ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.