Saturday, December 21, 2024

ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు?: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

తొగుట (దుబ్బాక ): ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం దుబ్బాక కేంద్రంలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కృతఙ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖపాత్ర దుబ్బాక ప్రజలదేనని, దుబ్బాక గడ్డ గులాబీ పార్టీకి అడ్డ అని కొనియాడారు. దుబ్బాక సత్తా ఏంటో యాభై నాలుగు వేల మెజార్టీతో ప్రజలు నిరూపించారని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో గెలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు మనకు కొత్త కాదని, కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తి గాయానికి గురికావడంతో తానే పూర్తి బాధ్యతలు తీసుకున్నానన్నారు. ఐదు సంవత్సరాలు ఎంపిగా ఉంటే ఎవరిని నొప్పించని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక, సిద్దిపేటలో తనతో కలిసి చాలా కష్టపడి పనిచేశారన్నారు. మంచి మెజారిటీలు సాధించడం దుబ్బాక కార్యకర్తల అహర్నిశలు కష్టపడి పనిచేసి విజయాన్ని అందించారని దుబ్బాక ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.

ప్రభుత్వం మారడం బిఆర్‌ఎస్ పార్టీకి ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని, తెలిసో తెలియకో ఏదైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేందుకు ఇదొక మంచి అవకాశమని అన్నారు. భవిష్యత్తులో ఏది ఏమైనా అంతిమ విజయం మనదేని భరోసా ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదని, ఎన్నోసార్లు జైలుకు వెళ్లి , ఎత్తు పల్లాలు చూసి లాఠీ దెబ్బలు తిని ఈ స్థాయికి చేరామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ ఫ్రీ ఇస్తామని మాట చెప్పి కరెంటు బిల్లులు వద్దని మళ్లీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. రైతుబంధులు పదిహేను వేల రూపాయలు ఇస్తామని మళ్లీ పాత పద్ధతిలోనే పది వేల రూపాయలు కూడా ఇంకా వేయలేదని, ఇదే సందర్భంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు ఆపేసి, ఉద్యోగులకు సగం జీతం ఇచ్చి రైతులకు సకాలంలో రైతుబంధు విడుదల చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల మీద ప్రేమ కాంగ్రెస్‌కు లేదన్నారు. మొదటిసారి గెలిచినప్పుడు 8 వేల 500 రూపాయలు ఇచ్చుకుంటూ రెండోసారి అధికారంలోకి రాగానే దాన్ని పదివేలకు పెంచుకున్నామన్నారు.

ఆసరా పెన్షన్లు వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళ ఇలా పెన్షన్లు అన్నింటిని పెంచుకున్నామన్నారు. రాబో యే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకొని ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మనం పోరాటం చేయాలని సూచించారు. ఇదే రెండు జాతీయ పార్టీలు బిజెపి కాంగ్రెస్ తోడు దొంగలని తెలంగాణ వచ్చిన వెంటనే ఏడు మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కాంగ్రెస్ బిల్లు పెడితే దానికి బిజెపి మద్దతు ఇచ్చిందన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు మద్దతు ఇవ్వడం వల్లే ఆ ఏడు మండలాలు పవర్ ప్రాజెక్టులు మనకు కాకుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోయాయన్నారు. అలాగే ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి కేటాయించలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలకు కాంగ్రెస్ బిజెపిలకు తగిన గుణపాఠం పార్లమెంట్ ఎన్నికలలో చెప్పాలన్నారు. జాతీయ పార్టీలకు ఓట్లు, సీట్లు కావాలి మన రాష్ట్ర ప్రయోజనాలు వారికి పట్టవన్నారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డిబిఎమ్‌ఎస్ చైర్మన్ శివకుమార్, మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ నర్సింహారెడ్డి, వంశీ, మనోహర్, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనిత, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News