రుణమాఫీ అందని రైతుల కోసం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వాట్సాప్ హెల్ప్ లైన్ సెంటర్‌ను మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటి వరకు 72 వేల ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా హరీశ్‌రావు వెల్లడించారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులతో హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం మంత్రులు సన్నాహక సమావేశాల పేరిట నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం క్రెడిట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు.
పదేళ్ల బిఆర్‌ఎస్ విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు సర్కార్ ఫీట్లు చేస్తోందని అన్నారు. రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వారికి వచ్చిందని,దాంతో వారే ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా కరువుని పారదోలాలన్న మహత్తర లక్ష్యంతో కెసిఆర్ సీతారామ చంద్రుల పేరిట ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు పరాన్నజీవులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడు, ఎనిమిది నెలల్లోనే అన్నీ చేసి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేశారా..? అని ప్రశ్నించారు. 30 వేల ఉద్యోగాల తరహాలోనే సీతారామ గురించి చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. సీతారామ విషయంలో నిజాలు చెప్తారన్న నమ్మకం తమకు లేదని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ విజయాలను కాంగ్రెస్ నేతలు తమవిగా చెప్పుకునే ప్రయత్నం చేయడమే తమ నైతిక విజయమని వ్యాఖ్యానించారు.