Monday, December 23, 2024

ఈనెల 18 నుంచి రెండవ విడత కంటి వెలుగు

- Advertisement -
- Advertisement -

మెదక్: అంధత్వంతో బాధపడుతూ రంగుల ప్రపంచాన్ని అస్వాదించలేని ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి టి. హరీష్‌రావు అన్నారు. సర్వేంద్రియం నయనం ప్రదానం అన్న దృక్పథంతో గత విడత మాదిరే ఈ రెండవ విడతలో కూడా రాష్ట్రంలోని కోటిన్నర మందికి ప్రయోజనం చేకూర్చాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయుటలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములై అంకితభావంతో పనిచేయాలని కోరారు.

మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, వైద్యాదికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మేడ్చల్ జిల్లా నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి చేపట్టనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఇందులో 35 గ్రామీణ ప్రాంతాలలో కాగా, 5 పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతోపాటు మరో 5 బృందాలను బఫర్‌లో అదనంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

కాగా ఒక్కో బృందంలో ఒక ఆప్టోమెట్రిస్ట్, ఒక వైద్యాదికారి, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏయన్‌ఎంలు, ఇద్దరు సూపర్‌వైజర్లు, ముగ్గురు ఆశావర్కర్లు ఉంటారని ఆమె తెలిపారు. జిల్లా జనాభా 8,85,519 మందిగా అంచనా వేశామని అందులో గ్రామీణ ప్రాంత జనాభా 7,39,444 కాగా పట్టణ జనాభా 1,20,075 అని అందులో 55శాతం అనగా 4,72,802 మందికి కంటి పరీక్షలు నిర్వహించుటకు 469 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలోని వార్డులలో ఈనెల 18 నుంచి వంద పనిదినాలు శిభిరాలు ఏర్పాటు చేయుటకు గ్రామ, వార్డు వారీగా షెడ్యూల్ రూపొందించామని అన్నారు.

ఈ వీడియో కాన్పరెన్స్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, సిఎస్ సోమేశ్‌కుమార్, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, శ్వేతా మహంతి, వైద్య సంచాలకులు శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషద్ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా వైద్యాదికారి చందునాయక్,జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డిఆర్‌డిఓ శ్రీనివాస్, డిపిఓ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమీషనర్ జానకిరాంసాగర్, జిల్లాపరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, వైద్యాదికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News