హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం పకడ్బందీగా, ప్రణాళికతో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మన ఊరు-మన బడి, దళిత బంధు, మున్సిపాలిటీలలో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లూ, వైకుంఠ ధామాల పురోగతి తదితర అంశాలపై మంత్రి సమీక్షించి, ఆయా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి అమలును పకడ్బందీగా చేపట్టాలన్నారు. పన్నెండు రకాల మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతగా విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన 1097 ఎంపిక చేశామని, అందులో సంగారెడ్డి జిల్లాలో 441, మెదక్ జిల్లాలో 313, సిద్దిపేటలో 343 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆయా బడులలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించాలన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యులు, స్కూల్ హెచ్ఎం, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పెంపొందించుకుని వాస్తవంగా అవసరం ఉన్న పనుల గుర్తింపు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు కూడా పక్కాగా ఆయా పనుల అంచనాలు రూపొందించాలన్నారు.
ప్రతి పాఠశాలలోను నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరిపించాలన్నారు. పనులు నాణ్యతగా చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కే మంజూరీ అధికారాలు ఉన్నాయని, కలెక్టర్లకే నిధులు విడుదల చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7289 కోట్లు ఖర్చవుతుందని అంచనా ఉందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ శాఖను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ఈనెల 9వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ లోని మూడు జిల్లాల్లో ప్రారంభించాలని మంత్రి సూచించారు. మంజూరు కూడా త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడా ఇసుక సమస్య లేకుండా ముగ్గురు కలెక్టర్లు సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
Harish Rao review on Mana Ooru Mana Badi in Sangareddy