హైదరాబాద్: మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఎమ్ సిఆర్ హెచ్ఆర్ డిలో వైద్య, అర్ అండ్ బి, టిఎస్ఐఐసి, టిఎస్ఎంఎస్ఐడిసి అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనునుందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చెప్పారు. గచ్చిబౌలి, సతన్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటికి 5 మెడికల్ కాలేజీల ఉంటే, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో 17కు పెంచుకున్నామన్నారు. జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా నూతన మెడికల్ కాలేజీల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొదటి దశలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు, రెండో దశలో 8 మెడికల్ కాలేజీలు మూడవ దశలో 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయని చప్పారు. మొదటి దశలో భాగంగా మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రెండో దశలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరిగితున్నాయని చెప్పారు. మూడవ దశలో సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ మెడికల్ కాలేజీలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.
Harish Rao review on new medical colleges construction