ఆశాలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు
అమలుపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
దేశంలో తెలంగాణలోనే ఆశాలకు అత్యధిక పారితోషకం
గడిచిన 9 ఏండ్లలో వైద్యారోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది
వైద్యారోగ్య దినోత్సవంలో అందరూ భాగస్వామ్యం కావాలి
నాడు 30 శాతం ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు, నేడు 69 శాతానికి చేరాయి
రాష్ట్ర సగటు కంటే తక్కువ డెలివరీలు నమోదవుతున్న జిల్లాల్లో మార్పు రావాలి
నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశాలు, ఎఎన్‌ఎంలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వారు అందిస్తున్న సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణ ఆశాలకు ఇస్తున్నారని చెప్పారు. వేతనాల పెరుగుదల, సకాలంలో వేతనాలు పొందేందుకు నాడు ధర్నాలు, నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ అలాంటి అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు సార్లు వేతనాలు పెంచామని, ప్రస్తుతం రూ.9,750 ఇస్తున్నట్లు తెలిపారు. ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఎఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని మంత్రి హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలను ఆదేశించారు. సోమవారం నాడు ఆశాలు, ఎఎన్‌ఎంలతో మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దశాబ్ది ఉత్సవాల పండుగను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 9 ఏళ్ల కాలంలో మన రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతిని శాఖల వారీగా మనం ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూన్ 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రసవాల్లో ప్రభుత్వాసుపత్రులు టాప్
వైద్యారోగ్య శాఖలో మనందరం కలిసి చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్ నెలలో దేశ ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలోనే మన ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డ్ సృష్టించాయన్నారు. 69 శాతం ప్రభుత్వం ఆసుపత్రి ప్రసవాలతో గణనీయమైన వృద్ధి సాధించాయని పేర్కొన్నారు. 16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డి (87), నారాయణ్ పేట్(83), మెదక్ (82), జోగులాంబ గద్వాల్ (81) సాధించిన జిల్లాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 2014లో 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు ఉంటే, ఇప్పుడు ఏప్రిల్ నాటికి 69 శాతానికి చేరాయని చెప్పారు.
ఇదే తీరుగా ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ ప్రభుత్వ ప్రసవాలు నమోదు చేస్తున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి నమోదు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. సీ సెక్షన్లు అధికంగానూ, ఇతర పారామీటర్లలో పనితీరు తక్కువ కనబర్చుతున్న కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మెటర్నిటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని వారం పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇమ్యూనైజేషన్ తక్కువగా నమోదవుతున్న సూర్యపేట జిల్లాలకు ఇమ్యూనైజేషన్ విభాగం జెడిని క్షేత్రస్థాయి పరిశీనలకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మెటర్న్ హెల్త్ ఓవరాల్ పనితీరులో చివరి స్థానంలో ఉన్న వనపర్తి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట్ జిల్లాల్లో పురోగతి కనిపించాలని చెప్పారు.
కనిష్ఠ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన 53 సబ్ సెంటర్ల తీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అన్ని పిహెచ్‌సీల్లో ఈ ఔషధీ ద్వారానే మందులు పంపిణీ చేస్తూ, మూడు నెలల కనీస నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. డిఎంహెచ్‌ఒలు సబ్ సెంటర్, పిహెచ్‌సిల స్థాయిలో రివ్యూలు నిర్వహించుకోవాలని, అందుతున్న వైద్య సేవల పట్ల క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన చేయాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్‌లో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమం విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డిపిహెచ్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఒలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.