Monday, January 20, 2025

వారంలోగా ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. కౌన్సిలింగ్‌ను పూర్తి చేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుండి అడిషనల్ డిఎంఇగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితిని 57 ఏళ్ల నుండి 64 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అడిషనల్ డిఎంఇ పదోన్నతి ప్రక్రియ వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డిఎంఇ రమేష్ రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఛైర్మెన్ రాజలింగం, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని 371 నర్సుల ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. అదే విధంగా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్ సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
డెంగ్యూ వ్యాధి చికిత్సలో ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ మిషన్లను రూ. 10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటి ఏర్పాటు వల్ల సకాలంలో రోగ నిర్ధారణ జరిగి సత్వరం చికిత్స అందించవచ్చని తెలిపారు. పి.ఎం.పి,ఆర్‌ఎంపిలకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులకు మంత్రి హరీశ్ రావు కీలక అదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై పూర్తి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభించే మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఈ ఏడాది నుండి తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణం సంబంధించిన పనులు వేగవంతం చేయాలని అన్నారు. కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, (204) 108 వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి
వైద్యారోగ్య శాఖను పటిష్టం చేసేందుకు సిఎం కెసిఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారు… కాబట్టి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని ప్రతి ఆరోగ్య కార్యక్రమంపై సంబంధిత అధికారులు నిత్యం సమీక్షలు చేయాలని చెప్పారు. వారంలో కనీసం రెండు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలని అన్నారు. బస్తీ దవాఖానల ద్వారా పట్టణ పేద ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 134 రకాల పరీక్షలు ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్ధేశనం చేశారు. తక్షణం పరీక్షలు నిర్వహించి వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News