Friday, November 15, 2024

ఖాళీల లెక్క తేల్చాలి

- Advertisement -
- Advertisement -

వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల లెక్క తేల్చాలి
అధికారులకు మంత్రి టి.హరీష్‌రావు ఆదేశాలు
ఉన్నతాధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష
రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టంలోని
షెడ్యూల్ 9, 10లో ఉన్న కార్యాలయాలు, ఆస్తులపై చర్చించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల లెక్క తేల్చాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, సిఎస్ సోమేశ్ కుమార్‌లు గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షెడ్యూల్ 9,10కు సంబంధించిన అంశాలు, పబ్లిక్, గవర్నమెంట్ ఆస్తులపై చర్చించారు. 9,10 షెడ్యూల్ కింద ఉన్న సంస్థలపై శాఖల వారీగా మంత్రి హరీష్ రావు సమీక్షించారు. వీటితో పాటు ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న ఆస్తుల డేటా సేకరణపై సమీక్షించారు. నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ప్రతి విభాగం కింద ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తుల సంఖ్య వివరాలను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై ఉన్నతాధికారులతో హరీష్‌రావు ఆరా తీశారు. వివిధ అంశాలపై దాదాపు 6 గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అనుమతి లేని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలపై అనుసరించాల్సిన పంథాపై, రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న కార్యాలయాలు, ఆస్తులపై చర్చించారు. పిఆర్‌సి నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్‌పై సమీక్షించారు.

శాఖలవారీగా వివిధ సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు, భవనాలు, ఇతర స్థిరాస్తుల వివరాల డేటా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు మంత్రి హరీష్‌రావు స్పష్టమైన సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆస్తుల విభజనపై అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. 9వ షెడ్యూల్‌లోని 91లో వివాదరహితమైన 70 సంస్థలకు సంబంధించి షీలా భిడే కమిటీ సిఫారసుల ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపారు. 10వ షెడ్యూల్‌లోని 142 సంస్థల సంబంధించిన నగదు పంపకాలు మినహా ఇతర అంశాలను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు. 2014 జూన్ 2 వరకు ఉన్న నగదును రెండు రాష్ట్రాలు 58:42 దామాషాలో పంచుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే 90 శాతం పూర్తైన 10వ షెడ్యూల్ సంస్థల నగదు పంపిణీ జరగాలని, శాఖలవారీగా షెడ్యూల్ 9, 10 సంస్థల భూములు, భవనాలు, ఇతర స్థిరాస్తుల వివరాలు క్రోడీకరించాలని సంబంధిత అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

ఈ సమావేశంలో టిఆర్ ండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ.రాణి కుముదిని, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఇపిటిఆర్‌ఐ డిజి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఐటిఇ అండ్ సి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజ, వివిధ విభాగాల కార్యదర్శులు హాజరయ్యారు.

Harish Rao review with Officials at BRKR Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News