సిద్ధిపేట: రైతులు ఆయిల్ పంటలపై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కాలానికీ అనుకూలంగా ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి, అనంతసాగర్ గ్రామాల్లోని పెద్దమ్మ పెద్ది రాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరి పంటలు వేయడం వల్ల రైతులకు ఎకరానికి 20 వేల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని అన్నారు. వరి నాట్లు వేయడం వల్ల ఎక్కువగా ఖర్చులు అవుతున్నట్లు తెలిపారు. రైతులు ఆయిల్పామ్ పంటలపై దృష్టి సారించాలని అన్నారు. ఆయిల్ పంటలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నఎక్కువగా సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికనగా ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులంతా మల్బరీ తోటల పెంపకం దృష్టిసారించాలని మంత్రి అన్నారు.
Harish Rao says farmers to cultivate oil palm