అబద్ధాలు చెప్పడంలో సిఎం రేవంత్ రెడ్డి రికార్డు మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైంది
మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు
అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి ఒక్క నిజం కూడా చెప్పలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీష్ రావు పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడంలో సి ఎం.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయిందని విమర్శించారు. రెండు గంటల సిఎం ప్రసంగంలో రైతుభరోసా ఎప్పుడిస్తారో చెప్పలేదని అన్నారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంఎల్‌ఎలు కాలే రు వెంకటేష్, కె.పి.వివేకానంద, చింత ప్రభాకర్‌లతో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం తీరు.. మైకులో రంకెలు వేసి, గజ్జెల లాగేసుకుని.. పోతురాజు తీరుగా పడేల్ పడేల్‌మని ఆయనది ఆయనే కొట్టుకుని పారిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
సిఎం పదేండ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదని, చేసింది అంతకన్నా లేదని అన్నారు. సబ్జెక్ట్ లేనోడికి వదురుడు ఎక్కువ.. చేతగానోడికి ఏతులెక్కువ అని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రిగా మైక్ దొరకడమే రేవంత్ రెడ్డికి ఉన్న అనుకూలత అని పేర్కొన్నారు. అదే మైక్ తమకు ఇవ్వ వద్దని ముఖ్యమంత్రే స్పీకర్‌కు చెప్పారని ఆరోపించారు. ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పా, బిఆర్‌ఎస్‌కు మైక్ ఇస్తే.. తన అబద్ధాలను బయటపెడతారంటూ.. మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్‌కు చెప్పి బయటకు పారిపోయాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి తెలిసింది గోరంత అని…ఆయన చెప్పేదంతా అబద్ధాలే అని పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి.. అసెంబ్లీలో కూడా అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సిఎం ఒక్కటన్నా నిజం చెప్పారా..? అని నిలదీశారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గొంతు చించుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ అబద్ధాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలేమో అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని హరీష్‌రావు పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు ఈ సిఎం.. ప్రారంబోత్సవాలు చేస్తున్నారన్నారు. మూసీ మురికి కూపంగా మారేందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అని, మూసీ పరివాహకంలో తమతో కలిసి పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక.. అప్పులు కారణంగా చూపిస్తున్నారని ఆరోపించారు.
రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పలేదు
రేవంత్ రెడ్డి చేసిన రెండు గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడిస్తారో..? ఎంత ఇస్తారో..? ఒక్క ముక్క కూడా చెప్పలేదని హరీష్‌రావు విమర్శించారు. రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును కడితే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఆయన మాట నమ్మి చాలామంది రైతులు రెండు లక్షలకు పైగా ఉన్న రుణాన్ని కట్టేశారని, కానీ వాళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. గత నెల 30వ తేదీన మహబూబ్‌నగర్ వెళ్లి సిఎం నిధులు విడుదల చేశానని చెప్పాడన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతు బ్యాంకులో ఆ డబ్బు జమ కాలేదని అన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో తాము ప్రభుత్వం నోరు మూయించామని తెలిపారు.
ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లెక్కలు, అంకెలతో సహా చూపించి, అప్పు రూ.4.17 లక్షల కోట్లే అని బల్లగుద్ది చెప్పి ప్రభుత్వం నోరు మూయించామని అన్నారు. ఈ ఐదారు రోజులుగా సభలో ప్రభుత్వం తేలిపోయిందని, అందుకే రేవంత్ రెడ్డి తన కడుపులో ఉన్నదంతా కక్కేశాడని విమర్శించారు. రైతు భరోసా మీద శనివారం జరిగిన చర్చ అంతా రాజకీయ ఉపన్యాసంగానే ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20.33 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు చూసే.. కోకాకోలా కంపెనీ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌కు 20 టిఎంసిలు తెస్తానని సిఎం చెబుతున్నారు.. ఎలా తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వానాకాలం రైతుబందు రూ.7,500 కోట్లు ఎగవేశారని హరీష్‌రావు పేర్కొన్నారు.