Tuesday, January 21, 2025

మూసీ నుంచి పాదయాత్రకు సిద్ధం: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైడ్రా ప్రభావంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయ్యిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోతున్నా, తెలంగాణలో మాత్రం ఎందుకు తగ్గుతోందని నిలదీశారు. రేవంత్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమపై కేసులు నమోదు చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్‌స్‌కు వంద సీట్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రేవంత్ తప్పుడు విధానాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు. తప్పుడు కేసులతో తనను, కెటిఆర్‌ను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమపైనే కాకుండా ప్రశ్నించే గొంతులపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. పాదయాత్రకు తాను సిద్ధమని, మూసీ దగ్గరి నుంచే బయలుదేరుతామని సీఎంకు సవాల్ విసిరారు.

రోజు సమయం చెప్పాలని, తాను, కెటిఆర్ ఇద్దరం వస్తామన్నారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్ పెట్టడం తుగ్లక్ చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, దురాలోచనతోనే ఆర్‌ఆర్‌ఆర్కే రూ.35 వేల కోట్ల ఖర్చు అని అంటున్నార అన్నారు. కేంద్రం ఫ్రీగా చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం ఎందుకని నిలదీశారు. అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం 11 నెలల్లోనే రూ.85 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని అన్నారు. రేవంత్‌కు ఫుట్‌బాల్ ఒక్కటే వచ్చని, తనకు క్రికెట్ కూడా తెలుసునని అన్నారు. రేవంత్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని, ప్రశ్నింకే గొంతుక కేటీఆర్‌పై పగబడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి సిఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, రేవంత్ సీఎం అయ్యేవాడు కాదన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చేది బీఆర్‌ఎస్ మాత్రమేనని, సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించిన వ్యక్తిని సీఐ కొట్టిన ఘటనపై కెటిఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్‌లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య బెల్ట్ తో కొట్టిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్‌కు కెటిఆర్ ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయ పరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మొత్తం భాస్కర్‌కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా చెల్లిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News