Wednesday, January 22, 2025

గ్యారేజీకి గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ డబ్బును సిఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని, మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు ఆరోపించారు. మంత్రులు పాలన గాలికి వదిలేసి రాష్ట్రాలు, దేశాల బాట పట్టారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్యరావులతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, నిజాలు చెప్పటానికి మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి వచ్చారని విమర్శించారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాము ఏ పార్టీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా ప్రచారం చేయమని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై వాస్తవాలు చెప్పటం తమ బాధ్యత అని చెప్పారు.

మహారాష్ట్రాలో బిఆర్‌ఎస్‌కు పొలిటికల్‌గా గ్రౌండ్ లేదని, అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో తాము పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయని విమర్శించారు. రోడ్ల మీదున్న వడ్ల కుప్పలే.. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రేవంత్ అబద్దాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారని విమర్శించారు. మొదటి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నారని చెప్పారని, రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేశామని ఎఐసిసి అధికారి ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 40లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్టు చేసి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు గ్యారంటీల అమలుపై చర్చకు సిద్ధమా..?
తెలంగాణలో మోసం చేసినట్లు మహారాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, దాదాపు ఏడాది పూర్తవుతున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు. ఏ హామీలు అమలు చేశారో.. ఎక్కడ చర్చిద్దామో చెప్పాలని, ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని హరీశ్‌రావు సవాలు విసిరారు. అభయహస్తంలో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పారని, ఆ హామీకే దిక్కేలేదని, కానీ మహారాష్ట్రలో కోతలు కోస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఒక్కో మహిళకు రూ. 27,500 ప్రభుత్వం బాకీ పడిందని, కానీ రేవంత్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దని, తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని హితవు పలికారు. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారని, రైతు భరోసా ఇచ్చామని చెప్పగలరా…? ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇచ్చారా..? అని అడిగారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.

వందల ఇండ్లు కూలగొట్టామని చెప్పాల్సి ఉండే
సిఎం రేవంత్ ఇండ్లు కూలగొట్టారు… కానీ ఒక్క ఇళ్లు కట్టారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 11 నెలల్లో రాష్ట్రంలో ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టానని చెప్పాల్సి ఉండే అని విమర్శించారు. ఒక్కరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చావా..? అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ పెట్టిన ఘనత రేవంత్ ది అని అన్నారు. . నేడు విద్యార్థులను, నిరుద్యోగులను రోడ్డు మీదికి తెచ్చావని అన్నారు. రూ.4000 ఫించన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు.. ఒక్కొక్కరికి రూ. 26 వేల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని అన్నారు. 41 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రభుత్వం బాకీ పడిందని.. ఇవన్ని అమలు చేయలేదని రేవంత్ చెబితే బాగుండేదని అన్నారు.10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పి, కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశానని మహారాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాలని సూచించారు. నోటిఫికేషన్ ఇచ్చింది లేదు..పరీక్షలు పెట్టింది లేదు..మరి ఎలా 50 వేల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. అశోక్ నగర్ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయించిన ఘనత రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. అర్థరాత్రి ఆడపిల్లలను అరెస్ట్ చేయించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. జిఒ 29 పేరుతో ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రశ్నించిన నిరుద్యోగులపై పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News