సిఎం రేవంత్ పైశాచిక
భాషలో పిచ్చి ప్రేలాపనలు
పాలమూరును ఎండగట్టిన
పాపం కాంగ్రెస్, టిడిపిలదే
ఆ రెండు పార్టీల్లో ఉన్న
రేవంత్‌కు పాపంలోనూ
పాలు రేవంత్ సవాల్‌ను
స్వీకరిస్తున్నా : హరీశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడారు, పి చ్చి ప్రేలాపనలు పేలారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను ఎపి యధేచ్ఛగా తరలించుకపోతుంటే ఆ పడం చేతగాక, ఆయన చేతగాని తనాన్ని గుర్తు చేసిన తమ మీద రంకెలేస్తున్నారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పాలమూరును ఎడారిగా మా ర్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి అని, పాలు తాగి రొ మ్ము గుద్దిన చరిత్ర ఆయనది అని, అది చరిత్ర చెపుతున్న సత్యం అని వ్యా ఖ్యానించారు.
పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పె ట్టిండు రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు అని, ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన రేవంత్‌రెడ్డి పాపమే పాలమూరుకు శాపమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక తమ పొత్తు కోసం జోలె పట్టింది నువ్వు, ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి, పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్ అని చెప్పారు.పాలమూరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టిడిపిలది అయితే ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ రెండు పాపాల్లో వాటా ఉందని అన్నారు.
పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతామన్నందుకే కదా దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తాము బయటకు వచ్చామని, నదీ జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని తెలిపారు. రేవంత్‌రెడ్డి వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా..?…ఆయన వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా..? అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది,వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరిచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసినా మోడీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లికే సాధ్యం అని వ్యాఖ్యానించారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పనికిమాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు తాను సిద్ధం అని, సిఎం సవాలను స్వీకరిస్తున్నా అని ప్రకటించారు. ఏ రోజు చర్చ చేద్ధాం.. ఎక్కడ చర్చ చేద్దాం రేవంత్‌రెడ్డే చెప్పాలని అన్నారు. సిఎం చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తానని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు సిఎం ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తానని చెప్పారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచవలసిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్‌ల సంగతి సకలం చర్చిస్తానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కెసిఆర్‌పై కక్ష పూరిత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఎపి కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న రేవంత్‌రెడ్డి దవడనే పగలగొట్టాలని అన్నారు. అరుపులు,పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు అంటూ రేవంత్ రెడ్డి ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. నిందలు వేయడం మాని నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు అని, అబద్దాల కోసం అజ్ఞానిలా బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించాంటూ సిఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
అందరికీ రుణమాఫీ.. అందమైన కట్టుకథ : హరీష్‌రావు
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనే అని, 420 హామీల అమలు వట్టి బూటకమే అని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నరని పేర్కొన్నారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్‌కు చేరకముందే పాపపరిహారం చేసుకోవాలని సూచించారు. రైతులు, మహిళలకు,
విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాక వస్తారని, ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు… అయినా వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి పట్టుదలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బిఆర్‌ఎస్ పక్షాన పిలుపునిచ్చారు.