హైడ్రా పేరుతో విధ్వంసాలు సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి
రుణమాఫీ సగం…రైతులు ఆగమాగం
ముఖ్యమంత్రిని తిట్టని ఊరు లేదు
కనీవినీ ఎరుగని రీతిలో బిఆర్‌ఎస్ ఆవిర్భావ రజోత్సవ బహిరంగ సభ
గులాబీ జెండా పుట్టిన సిద్దిపేట నుంచి వరంగల్ సభకు 20 వేల మంది తరలింపు
1000 మంది విద్యార్థులతో పాదయాత్ర, 100 ట్రాక్టర్‌లతో భారీ ర్యాలీ
మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు
పేద ప్రజల ఉసురు, మూగజీవాల ఆర్తనాదాలు ఊరికే పోవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ రజోత్సవ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని అన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసాలు చేసి పేదల జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకుంటున్న రేవంత్‌రెడ్డికి ఈ మూగజీవాలు సైతం క్షమించవని వ్యాఖ్యానించారు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టడంతోపాటు రుణమాఫీ సైతం సగం మందికే చేసి రైతులను ఆగమాగం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ ఇంతేనని అసెంబ్లీలో చెప్పి చేతులు దులుపుకున్న ఘనత రేవంత్ రెడ్డిదేనని అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్న ఈ ముఖ్యమంత్రిని తిట్టని ఊరు లేదన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో సైతం రైతులను ఆదుకున్న ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని అన్నారు. పంటల బోనస్ బోగస్‌గానే మిగిలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, జనగాంలలో సుమారు 50 వేల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రంగనాయకసాగర్‌లో ఒక్క టిఎంసి నీటిని తెప్పించడంతోనే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఎకరం సైతం ఎండిపోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేఖతను వరంగల్‌లో ఈనెల 27న జరిగే బిఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభలో ఎండగడతామని అన్నారు. బిఆర్‌ఎస్ పుట్టిందే సిద్దిపేటలో అని, వరంగల్‌లో జరిగే సభకు 20 వేలమందిని తరలిస్తున్నామని అన్నారు. సిద్దిపేట నుంచి 1000 మంది విద్యార్థులు, యువత సభకు పాదయాత్రగా తరలివెళ్తారని అన్నారు. 100 ట్రాక్టర్‌లతో ర్యాలీ ద్వారా వెళ్లనున్నట్లు తెలిపారు.
పల్లెపల్లెన గులాబీ జెండా పండుగ నిర్వహిస్తామని అన్నారు. నంగునూర్ మండలానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకుడు మహిపాల్ రెడ్డి వరంగల్ సభ ఖర్చుకు రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. మందపల్లి గ్రామస్థులు సైతం కూలీ పని చేసి స్వచ్ఛందంగా సభకు తరలి వస్తామనడం అభినందనీయని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వేలేటి రాధకృష్ణశర్మ, కడవేరు రాజనర్సు, కూర మాణిక్య రెడ్డి, మల్లయ్య, పూజల వెంకటేశ్వర్‌రావు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, గుండు భూపేష్, మోహన్‌లాల్, ఎల్లు రవీందర్‌రెడ్డి, కనకరాజు, కొండం సంపత్‌రెడ్డి, అత్తర్ పటేల్, మేర్గు మహేష్, ఎల్లం, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.