Thursday, December 26, 2024

సిఎం రేవంత్‌రెడ్డి రైతులనే కాదు..రాహుల్‌ గాంధీని కూడా మోసం చేస్తున్నారు:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ చేయకుండా ప్రజలను సిఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తి కాలేదని మంత్రులే చెబుతున్నారని, వ్యవసాయశాఖ మంత్రి లెక్కల ప్రకారం 22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు. రైతులనే కాదు, రాహుల్‌గాంధీని కూడా రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియాతో సిఎం చేసేది చిట్‌చాట్ కాదు అని, చీట్ చాట్ అని విమర్శించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని పేర్కొన్నారు. రుణమాఫీ చేయని గజ దొంగవి నువ్వు.. నన్ను దొంగ అంటావా..అంటూ సిఎం రేవంత్‌పై మండిపడ్డారు. రుణమాఫీ పాక్షికంగా జరిగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు కదా అని గుర్తు చేశారు. వ్యవసాయ, రెవెన్యూ మంత్రులు కూడా రుణమాఫీ కాలేదని చెప్పిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు.

సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను బయటపెడతామన్నారు. కందుకూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 9లో 385 ఎకరాల భూమిని కాజేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే తుక్కుగూడ పరిధిలోని సర్వే నెంబర్ 895లో 25 ఎకరాల పేద రైతుల భూములు బినామీల పేరు మీదకు మారుతున్నాయని ఆరోపించారు. ముచ్చర్లలో సిఎం తమ్ముళ్ల పిఎల పేర్ల మీద కూడా భూములు కొంటున్నారని అన్నారు. సిఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి అరుణను గెలిపించారని అన్నారు. సిఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థికి ఎందుకు మెజారిటీ తగ్గిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి దగ్గరుండి బిజెపికి ఓట్లు వేయించారని ఆరోపించారు. ముందు మహేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తరువాత తమను అడగాలని హరీశ్‌రావు అన్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది తన సవాల్ అని, ఆ గడువులోగా చేశారా..? అని హరీశ్‌రావు నిలదీశారు. రుణమాఫీ సవాల్ ఏమైందో రైతులే చెబుతారని పేర్కొన్నారు. రుణమాఫీ సభకు రావాలని సిఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్‌గాంధీ రాలేదు అని పేర్కొన్నారు.

ఓటుకు నోటులో రూ. 50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగవు నువ్వు. నన్ను దొంగ అంటావా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాల్మీకి స్కామ్ పట్ట పగలు నిలువు దోపిడీ లాంటిదని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బిజెపి భాయి భాయి అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే వాల్మీకీ స్కామ్‌పై తెలంగాణలో విచారణ జరగడం లేదన్నారు. వాల్మీకీ స్కామ్‌పై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ స్కామ్‌పై ఇడిని కలిసి విచారణ జరపాలని కోరతామని హరీశ్‌రావు చెప్పారు.

ఇది కాంగ్రెస్ కూల్చివేతల సర్కారే
తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ కూల్చివేతల సర్కారే అని హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కూల్చివేశారని మండిపడ్డారు. వైద్య వ్యవస్థను పూర్తిగా కూల్చేశారని, దేవుళ్ల మీద ఒట్టేసి ప్రజల విశ్వాసాన్ని కూల్చేశారని అన్నారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారని పేర్కొన్నారు. హైడ్రా ఆఫీసే హుస్సేన్ సాగర్ నాలా కింద ఉందని, రంగనాథ్ ముందుగా ఆయన ఆఫీస్ కూల్చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీల ఫామ్ హౌజ్‌ల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లతో చెరువులు కలుషితం అవుతున్నాయని అన్న సిఎం..మంత్రి పొంగులేటి నివాసం నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ ఎక్కడి వెళ్తున్నాయో చెప్పాలన్నారు.

పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఉందా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజకు కనీసం మంత్రులు కూడా లేరని విమర్శించారు. తెలంగాణ తల్లి భావనకు రూపం ఇచ్చిందే కెసిఆర్ అని, ఆ క్రెడిట్ కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. సిఎం స్థానంలో ఉండి న్యాయస్థానాల తీర్పుపై వక్ర భాష్యాలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బిజెపి ఇప్పించిందా? అని ప్రశ్నించారు. ఈ పిచ్చి మాటల వల్లే ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News