Wednesday, December 4, 2024

లక్ష తప్పుడు కేసులు పెట్టించినా..నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను:హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

అడుగడుగునా సిఎం చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, ఆయన నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన సిఎం మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక తనపై అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు అన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావుపై నమోదైన కేసుపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అని సిఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. -సిఎంకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు..

ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు…సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో తన మీద సంబంధం లేని కేసు పెట్టించినవు…పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు…నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇప్పుడు పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించినవు అని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను…ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను హరీష్‌రావు తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News