Monday, April 28, 2025

బిఆర్‌ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్టపన్నాగాన్నీ అమలు చేసింది

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుండి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని పేర్కొన్నారు, కెసిఆర్ వచ్చి నిలదీస్తడు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. అందుకే అడుగు అడుగున పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించింది దుర్మార్గ సర్కారు అని, సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 10,15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికికక్కడ అడ్డుకున్నారని, ట్రాఫిక్ జాం పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారని అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చే దాదాపు1000 పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుండి యూ టర్న్ చేసి తిరిగి సిద్ధిపేట వైపు మళ్ళించారని,

ఆర్‌టిఒ అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారని, స్కూల్ బస్సులు అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, సహాయ నిరాకరణ చేసి సభను ఫెయిల్ చేసే కుట్ర చేసిందని ఆరోపించారు. సభకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేసి సంకుచిత బుద్ధిని మరోసారి కాంగ్రెస్ బయట పెట్టుకున్నదని విమర్శించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని తెలిపారు. తండోపతండాలుగా తరలివచ్చి గులాబీ జెండా సత్తా చాటారని వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే అని, ప్రజలను నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని చెప్పారు. సభను విజయవంతం చేసిన బిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, టీవీల్లో లక్షల సంఖ్యలో వీక్షించిన తెలంగాణ బిడ్డలకు హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News