Thursday, December 19, 2024

నా ప్రభుత్వమంటూనే.. గవర్నర్ వెన్నుపోటు

- Advertisement -
- Advertisement -

సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..?
రాజ్యాంగ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థ తూట్లు పొడిచే విధంగా తయారయ్యింది
రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలి
గవర్నర్ పరువుతీసేలా మాట్లాడుతున్నారు
విలేకరులతో చిట్‌చాట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థ తూట్లు పొడిచే విధంగా తయారయ్యిందని హరీష్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మాట్లాడాలని, కానీ గవర్నర్ పరువుతీసేలా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ను, మహిళగా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి హరీష్‌రావు గురువారం చిట్‌చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ గవర్నర్‌కు రాజ్యాంగ పదవిలో కొన్ని పరిధులు ఉంటాయన్నారు. వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా..? వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మేం అడిగామా..? ఎన్నిసార్లు.. ఎవరు ప్రారంభించాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని చేసే ప్రతి కార్యక్రమానికి ప్రెసిడెంట్‌ను పిలవడం లేదు కదా ఆయన ప్రశ్నించారు. కనీసం ప్రెసిడెంట్‌ను పార్లమెంట్‌కు పిలవలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ ప్రవర్తన ఉందని, గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి బాధ కలిగిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

7 నెలలు ఆపడం అవసరమా?
వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లు 7 నెలలు ఆపడం అవసరమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదన్నారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరని పదవీ విరమణ వయసు పెంచామని హరీష్‌రావుతెలిపారు. వర్సిటీల ఉమ్మడి నియామకాలు ఇతర రాష్ట్రాలు చేపట్టడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును 7 నెలలు ఆపి తిప్పి గవర్నర్ పంపడం ఎంత అన్యాయమని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం కాదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని, భద్రాచలం విలీన గ్రామాల బిల్లును గవర్నర్ ఆపారని మంత్రి తెలిపారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అని మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు.

గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారు?
నా ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ నడుస్తోందని, ఇక్కడ గవర్నర్ దీనిపై ఎందుకు అభ్యంతరం ఎందుకు లేవనెత్తిందని ఆయన ప్రశ్నించారు. బీహార్‌లో 1958 నుంచి కామన్‌రిక్రూట్‌మెంట్ బోర్డు ఉందని, 22 ఏళ్ల జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రంలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఈ బిల్లు ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఈ బిల్లు మనరాష్ట్రంలో తప్పేలా అవుతుందో గవర్నర్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

నోటితో నవ్వుతూ నొసలితో గవర్నర్ వెక్కిరిస్తున్నారని, గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఇప్పుడు అలాంటి బిల్లునే అడ్డుకుంటున్నారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, అవి బిజెపి పాలిత రాష్ట్రాలే కదా..? సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరయ్యిందన్నారు. దానికి ప్రొఫెసర్ల కొరత ఉందని, గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడారు..
జీ 20కి సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలా మాట్లాడారని హరీశ్‌రావు ఆరోపించారు. కెసిఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కెసిఆర్ మామూలు వ్యక్తా, ఇన్ని సార్లు రాజీనామా చేసి గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ఎన్నిసార్లు పోటీ చేసినా గెలిచారా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అనే సామెతను గవర్నర్ తెలుసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. కెసిఆర్ ప్రజల మనిషి అన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన సూచించారు. కెసిఆర్ ఓటమి ఎరుగని నాయకులని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన గెలుస్తారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. కెసిఆర్ సిద్ధిపేటకు వస్తానంటే మోస్ట్ వెల్కమ్ అని ఆయన తెలిపారు.

రజనీకాంత్‌కు తెలిసిన విషయాలు గవర్నర్‌కు తెలియదా..?
రజనీకాంత్ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి అని ఆయన రాష్ట్ర ప్రగతిపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆయనకు తెలిసిన విషయాలు కూడా గవర్నర్‌కు తెలియవా? అని మంత్రి ప్రశ్నించారు. పంచాయతీ, స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ట పరిమితిని పెంచితే గవర్నర్‌కు ఇబ్బంది ఏమిటనీ మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధి కోణంలో ఆ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ అలాంటి బిల్లును ఆపొచ్చా? అని మంత్రి హరీష్‌రావు అడిగారు. గవర్నర్ బిజెపి కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని, గవర్నర్ రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బిజెపిలో చేరి పోటీ చేయొచ్చని హరీశ్‌రావు సూచించారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డిల పైళ్లను గవర్నర్ రిజెక్ట్ చేసే అంశం ఏముందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News