మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని శనివారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి హరీష్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, మంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్‌లో ఉంచి వారికి చికిత్స అందించారని చెప్పారు. నాలుగు రోజులు గడించినా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదని, విద్యార్థిని లీలావతిని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్‌పై ఉండటం చూస్తే మనసు కలిచివేస్తున్నదని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నదని చెప్పారు. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణం అయ్యిందని మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతున్నదని, ప్రాణాలను బలిగొంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి, ఎస్‌సి ఎస్‌టి మంత్రి కూడా రేవంత్ రెడ్డి అని, ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం చెందారని విమర్శించారు. చూడడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటారని, సబితా ఇంద్రా రెడ్డిని, సత్యవతి రాథోడ్‌ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తుపై లేదా..? అని సిఎంను ప్రశ్నించారు.
సిఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి
ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని హరీష్‌రావు మండిపడ్డారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని అన్నారు. తాము ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు, సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే గురుకులాల మొక్కుబడి సందర్శన కాకుండా, ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు. ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు-, పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపాలని అన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులకు సకాలంలో చికిత్స అందించకపోవడం వారి ప్రాణాల మీదకు వస్తున్నదని, ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్నాదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సిఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రచారం కోసం కాకుండా పిల్లల భవిషత్తు కోసం ఆలోచించాలని కోరారు. చలికాలంలో విద్యార్థులు వణుకుతున్నారు..వేడి నీళ్ళు లేవు..వారికి బట్టలు కూడా ఇవ్వలేదు, ఆ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. హాస్టల్‌లో పని చేసే సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రీన్ ఛానెల్ ఉంటే ఆరు నెలలుగా హాస్టళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదని అడిగారు. ఇప్పటి వరకు లీలావతికి ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు లభించలేదని, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. లీలావతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షింంచారు. మిగతా విద్యార్థులను అవసరం అయితే నిమ్స్ తరలించి మంచి వైద్యం అందించాలని కోరారు.