Tuesday, November 5, 2024

పేరేమో ఉత్తమ్ కుమార్..మాట తీరేమో మూసీ ప్రవాహం:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడడంలో, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించడం ముఖ్యమంత్రి రేవంత్‌కు తానేమి వెనుకబడలేదని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్..? అని నిలదీశారు. పేరేమో ఉత్తమ్ కుమార్..- మాట తీరేమో మూసీ ప్రవాహం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జలయజ్ఞంలో ఇపిసి కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఇష్టమున్నట్లు ప్రాజెక్టుల ఆంచనా విలువలను పెంచేసి,

ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచి తెలంగాణను డెకాయిట్ చేసింది ఎవరు..? అని ప్రశ్నించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరు..మీరు కాదా ఉత్తమ్..? అని నిలదీశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే రూ.40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయావా ఉత్తమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డెకాయిట్ గురించి ఇప్పటికే ఎన్నోసారు చెప్పి ఉన్నా… మళ్లీ గుర్తు చేస్తున్నాను అని హరీష్‌రావు తెలిపారు.

అడ్వాన్స్‌లు దండుకున్నారు..
తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రాతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏక కాలంలో పనులని ప్రారంభించి అడ్వాన్స్‌లు దండుకున్నది మీరు కాదా..? అని మంత్రి ఉత్తమ్‌కుమార్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 2010లో కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్‌ని రూ.40,300 కోట్లకు సవరించి పంపింది ఆయన మంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..? అంటూ హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

కెసిఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను తమవిగా చెప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు కొత్తేమీ కాదని అన్నారు. సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజ్‌లు పూర్తి చేసి రెడీగా పెడితే బటన్ వొత్తి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్న వైనం చూసి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకున్నారని, ఇప్పుడు వరంగల్ జిల్లా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కమిషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు వదిలిపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది తాము అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News