తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్‌రావు పరోక్ష విమర్శ
మన తెలంగాణ/సంగారెడ్డి: తెలంగాణ గురించి కనీస అవగాహన లేని వారు రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడని అంటున్నారని, వారికి రాష్ట్రంపై కనీస పరిజ్ఞానం ఉందా? అని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మొసలి కన్నీరు గారుస్తున్నారని ఆరోపించారు. ఎపిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రమే ఇస్తుంటే.. తెలంగాణలో కేంద్రం నిధులతో పాటు రైతుబంధు పేరుతో అదనంగా ఎకరాకు పదివేల రూపాయలు అందిస్తున్నామన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మంచి నీటి బాధ లేదని, టిడిపి అధికారంలో ఉండగా ముక్కు పిండి రైతుల వద్ద కరెంట్ బిల్లులు వసూలు చేశారని విమర్శించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చిద్రుప్పలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్‌పి చైర్మెన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతు వేదికలు రైతుల ఆత్మగౌరవ భవనాలుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయ రంగానికే కేటాయిస్తామని మంత్రి తెలిపారు. కూరగాయలు, పండ్ల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో పాలించిన సిఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు రైతులకు అర్థరాత్రి దొంగ కరెంట్ ఇచ్చేవారని మంత్రి గత పాలకులపై విమర్శలు గుప్పించారు.
గత పాలకుల రాజ్యం లో రైతు చనిపోతే ఒక్క రుపాయి కూడ ప్రభుత్వాలు ఇవ్వలేదని, నేడు రైతు మరణిస్తే 5లక్షల రుపాయల భీమా వర్తిస్తుందని చెప్పారు. రైతుల సంప్రదాయ పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని మంత్రి సూచించారు. ఇరవై లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతు బంధు కోసం సంగారెడ్డి జిల్లాకు 700 కోట్ల రుపాయలు కేటాయించామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. దేశంలో బిజెపి పాలిస్తున్న కర్ణాటక, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వెళ్దామా అని మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్, బిజెపిలకు సవాల్ విసిరారు. వ్యవసాయ పనిముట్లను రైతులకు సబ్సిడీపై ఇచ్చేందుకు సిఎం యోచిస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్ నాయకులు తూలనాడుతూ మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు.
రైతు బంధు, ఉచిత కరెంట్‌లో ఏ రాష్ట్రమైన తెలంగాణాతో పోటీ పడుతుందో చెప్పాలని బిజెపి కాంగ్రెస్ నేతలను మంత్రి ప్రశ్నించారు. కందుల ధర ఆరువేలకు తక్కువ ఉంటే బయట ఆమ్మాలని మంత్రి సూచించారు. రాజకీయాల కోసమే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్ పాటిల్, మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మెన్ లత విజేందర్‌రెడ్డి, కంది జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, సంగారెడ్డి జడ్‌పిటిసి లావణ్య మనోహర్‌గౌడ్, కంది సరళ పుల్లారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు నర్సింలు, హరికిషన్, సంగారెడ్డి టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మోహన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్, చెర్యాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Harish Rao Slams YS Sharmila over her political party