సిద్దిపేట: నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ ప్రభుత్వ వికృత దాడిని ఖండిస్తున్నానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఆధారంగా నడుస్తామని, రిజర్వేషన్లు అమలు అవుతాయని, రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. కెసిఆర్ హయాంలో జిఒ 55 అమలు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం జిఒ 29 తీసుకొచ్చారని, ఈ జిఒతో ఎస్ సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. 29 జిఒతో పైతరగతుల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారని, వారి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
భారత రాజ్యాంగం భగవద్గీత అని రేవంత్ చెబుతున్నారో.. ఆ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్లకు అప్లయ్ చేయడం వల్ల నష్టం జరుగుతోందని, ఓపెన్ లో వచ్చిన వారికి రిజర్వేషన్లు పరిగణించొద్దని హరీష్ రావు కోరారు. దళితులకు, బిసిలకు, బలహీన వర్గాలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ పాలసీనా? అని అడిగారు. దళిత వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, కాంగ్రెస్ లో ఉన్న దళిత, బలహీన, మైనార్టీ వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సిఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలని కోరారు. యూపిపి ఎస్ సి లో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని, కానీ టిపిపిఎస్ సిలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఓపెన్ లో బలహీన వర్గాలకు ప్రవేశం లేకుండా చేయడం సరికాదని, హక్కులు కాపాడాలని పిల్లలు రోడ్ల మీదకు వస్తె ఉక్కుపాదంతో అణచి వేయడం మంచిది కాదని హరీష్ రావు సూచించారు. విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్ నగర్ అల్లడుతోందని, టెర్రరిస్టులతో, సంఘ విద్రోహ శక్తులతో వ్యవహరించినట్లు వ్యవహరించడం సరికాదని చురకలంటించారు.
సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు అంత కఠినంగా, కర్కశంగా విద్యార్థులతో ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి పిల్లలను రోడ్డు మీదకు తీసుకొచ్చిందని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చిందని, ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారని ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. కనీసం రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా? అని హరీష్ రావు అడిగారు.
కెసిఆర్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేసిన వాటికి కాగితాలు ఇవ్వడం తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదన్నారు. ఓట్లు వచ్చినప్పుడు కాదు అని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు అశోక్ నగర్ కు వెళ్ళాలని సూచించారు. పోలీస్ బలగాలు, లాటి ఛార్జీలు, ఇనుప కంచెలతో విద్యార్థుల్ని అణచి వెద్దామనుకుంటే మరింత ఉధృతం చేస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల గొంతుక అవుతానన్న ఎంఎల్ సి కోదండరాం ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని, కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి రాగానే గొంతు మూగపోయిందా? అని ఎద్దేవా చేశారు. కోదండరాం, రియజ్, ఆకునూరి మురళీ, నవీన్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు పొందారని, తప్ప విద్యార్థులకు దగా మిగిలిందన్నారు. పదవులు పొందిన వారంతా అశోక్ నగర్ కు రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వానాకాలం రైతులకు బంధు ఇవ్వలేదని, ఇప్పుడే తెలిసిందన్నారు. రేవంత్ రెడ్డి చెంపలేసుకుని రైతులకు క్షమాపణలు చెప్పాలని, లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అని చెప్పే రేవంత్ కు రైతులకు 15 వేలు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావడం లేదని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు వానాకాలం రైతు బంధు ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.