Wednesday, December 25, 2024

బిజెపిది గన్ కల్చర్.. మనది అగ్రికల్చర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పరుగులు తీస్తున్న వ్యవసాయరంగం
ఇక్కడ అమలవుతున్న పథకాలు మరెక్కడా లేవు
అన్నదాతకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్
చౌటుప్పల్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్

చౌటుప్ప: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్షంగా ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని లక్కారంలో మంగళవారం ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పును ఇచ్చి అభివృద్ధ్ధ్ది చేసే వారికి పట్టం గట్టారన్నారు. మునుగో డు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వందశాతం అమలు చేసేందుకు సిఎం కెసిఆర్ కంకణ బద్ధులై ముందుకు సాగుతున్నారని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్ వుంటే తెలంగాణలో అద్భుతమైన అగ్రికల్చర్ ఉందన్నా రు. డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకునే బిజెపి పాలిత రాష్ట్రాల్లో కెసిఆర్ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

రాష్ట్రప్రభుత్వంఅమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు, గొర్రెల పథకం, కెసిఆర్ కిట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, మిషన్ భగీరథ మంచినీరు లాంటి అద్భుతమైన పథకాలను ప్రజల్లోకి లోతుగా తీసుకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మనం చేసిన మంచి పనికి తగిన ప్రచారం కల్పించకపోతే బిజెపి, కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారాలను ప్రజల దరికి చేర్చే ప్రమాదం వుందన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రానికి చేసిన మంచి ఏమీ లేకపోగా వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి పేదవాడికి అందుబాటులో లేకుండా చేసిందన్నారు. ప్రజా క్షేత్రంలో బిజెపి కుట్రలను తిప్పికొట్టి ముచ్చటగా మూడవసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రైతుల విలువ, ఆదాయాన్ని పెంచిన ఘనత కెసిఆర్‌కు సొంతమని పేర్కొన్నారు. నాడు తినడానికి లేక అలమటించిన దుస్థితి నుంచి నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి నల్గొండ రైతు ఎదిగాడని ఆయన గర్వంగా ప్రకటించారు. దీనికి కారణం కెసిఆర్ పాలనేనని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కోనుగోలుకు కేంద్రం నిరాకరించినా రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. అద్భుతమైన సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల మన్ననలు కెసిఆర్ పొందారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం క్యూ కడితే పోలీసులు లాఠీచార్జి చేసేవారని, కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అన్నదాతకు అవసరమైన ఎరువులను సరిపడా సరఫరా చేస్తుందన్నారు. అలాగే నల్గొండ ప్రజలకు ప్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని ఆయన తెలిపారు. రెండవ తిరుపతిగా పేరొందిన యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన ఘనత కూడా కెసిఆర్‌దేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని తెలిపారు. గత పాలకుల హయాంలో ఏనాడూ వ్యవసాయానికి సరిపడా కరెంటు ఉండేది కాదన్నారు. వేసిన పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పుల్లో కూరుకు పోవడం తప్ప వారి ముఖాల్లో ఆనందం కనిపించేది కాదన్నారు. కెసిఆర్ వచ్చాక ఎక్కడ చూసినా పచ్చదనం రైతుల ముంగిట్లో ధాన్యపు రాశులు కళకళలాడున్నాయన్నారు.

తెలంగాణలో కరువు దారిద్య్రాన్ని తరిమి కొట్టిన అపర భగీరథుడు కెసిఆర్ అని ఆయన కొనియాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని బిజెపి కాంగ్రెస్ పార్టీలు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేయడమే పెట్టు కున్నాయని ఆయన విమర్శించారు. వారి కుట్రలను పటాపంచలు చేసి కెసిఆర్‌ను మూడవసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త మొక్కవోని దీక్షతో పని చేయాలని మంత్రి జగదీష్‌రెడ్డి దిశా నిర్ధేశనం చేశారు. అలాగే మునుగోడు ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ 2014కు ముందు తెలంగాణ ప్రాంతం ఏ పరిస్థితిలో ఉండేదో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు అందాయని తెలిపారు. ఎంతో వెనుకబడి పోయిన మునుగోడు నియోజకవర్గం గులాబీ జెండా, కెసిఆర్ పాలనలోనే అభివృద్ధి దిశగా శరవేగంగా అడుగులు వేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇటు నియోజకవర్గంలో అటు రాష్ట్రంలో మూడవసారి గులాబీ జెండాను ఎగురు వేసేందుకు బిఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, దేవీ ప్రసాద్, పల్లె రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News