Thursday, January 23, 2025

సిద్ధిపేట హైటెక్ సిటీగా ఇన్సాన్ పల్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో సిద్ధిపేట హైటెక్ సిటీగా ఇన్సాన్ పల్లి కాబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

సిద్ధిపేట: హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో సిద్ధిపేట హైటెక్ సిటీగా ఇన్సాన్ పల్లి కాబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట అర్బన్ మండలంలోని ఇన్సాన్ పల్లి గ్రామంలో బుధవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామం మీదుగా రూ.15కోట్లతో 18 కిలో మీటర్ల వరకూ డబుల్ రోడ్ వేసుకోవడం, అలాగే కోమటి చెరువు నుంచి గ్రామం దాటే వరకు ఫోర్ లేన్ రోడ్డు బటర్ ఫ్లై లైట్స్ ఏర్పాటు 3 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.ఎండా కాలంలో కూడా ఇన్సాన్ పల్లి గ్రామ చెరువు మత్తడి దూకడం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణ అభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకొచ్చారు. గ్రామ పరిధిలో రూ.30 కోట్లతో కేంద్రీయ విద్యాలయం, రూ.50 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.300 కోట్లతో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించబోతున్నామని తెలిపారు.

గ్రామంలో ఆల్ రౌండ్ అభివృద్ధి అన్నీ రంగాలలో జరగడంతో ఈ ప్రాంత భూములకు డిమాండ్ పెరిగిందని, రైతులు ఎవరు భూములు అమ్ముకోకూడదని, వ్యవసాయానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు కలలో కూడా రావని వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కళ్ళులేని కబోదులులాగా మారిపోయారని విమర్శించారు. పార్లమెంటులో కూర్చుని జూటా మాటలు మాట్లాడవద్దని కాళేశ్వరం నీళ్లు చూడాలంటే ఇన్సాన్ పల్లి గ్రామానికి రావాలని ప్రతిపక్ష పార్టీల నేతలకు సవాల్ విసిరారు. 70 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధాన మంత్రి మోడీ తన బాధ్యతల నుంచి తప్పుకుని తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి ఇంటిలో ఒక ఉద్యమకారుడు ఉన్నారని, మేమంతా ఉద్యమించి కేంద్రం వడ్లు కొనే వరకు ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో రైతులకు చేసిందేమీ లేదని, రైతులను ఆదుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ ఒకటేనని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10వేలు, రైతులకు 5 లక్షల భీమా, 24 గంటల కరెంటు ఇస్తున్నదని వెల్లడించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక్క చెరువు కాలువనైనా కట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ తదితర ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు మేలు అందించి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని చెప్పారు.

Harish Rao Speech at Ensanpalle in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News