Thursday, January 23, 2025

పనిచేసేవారికి పట్టం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్‌లో సి సెక్షన్‌లపై ఆడిట్ నిర్వహిస్తాం 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి అవార్డులు
ప్రదానం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందరూ సమష్టిగా కృషిచేసి ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వైద్యులలో బాగా పని చేసేవాళ్లను ప్రేమిస్తామని, గౌరవిస్తామని అన్నారు. అదే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొందరు చేసే తప్పుల వల్ల వ్యవస్థకు చెడ్డపేరు రావద్దని అన్నారు. వైట్ కోట్‌పై ప్రజలలో మరింత గౌరవం పెరగాలని ఆ కాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, గాందీ సూపరింటెండెంట్ రాజారావు, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రతి వ్యవస్థలో మంచి, చెడులు ఉంటాయని అ న్నారు. నిజం గడప దాటకముందే అబద్దం ఊరం తా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బ యటకు రావడంలేదని పేర్కొన్నారు. శాఖలో చెడు మాత్రమే ప్రచారం అవుతోందని, అందుకే మంచిగా పనిచేసే సిబ్బందిలో కొందరిని నిర్ణయించామని తెలిపారు. ఆశావర్కర్లు మొదలు వైద్యారోగ్యశాఖలో అన్ని స్థాయిల సిబ్బందిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నట్లు చెప్పా రు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఒక కుటుంబం మాదిరిగా ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందని అద్నరు.
కరోనా ముందు అగ్ర దేశాలు కూడా మోకరిల్లాయి
కరోనా ముందు అగ్ర దేశాలు కూడా మోకరిల్లాయని అన్నారు. అభివృద్దిలో సాటి లేదని చెప్పుకునే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైతం శవాల దిబ్బలు చూశాయని పేర్కొన్నారు. మన దేశంలో కొవిడ్ పరిస్థితులను చాలా బాగా మేనేజ్ చేయగలిగామని చెప్పారు. కరోనా సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు వస్తే ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లను 3 నుంచి 33కు పెంచుతున్నామని తెలిపారు. ఎంబిబిఎస్, పిజి సీట్లతో పాటు సూపర్‌స్పెషాలిటీ సీట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా సామర్థం పెంచుకున్నామని తెలిపారు. కేవలం మాటలు చెప్తే కాదని, నిధులు కూడా ఇస్తేనే మార్పు సాధ్యమని గుర్తించి, ముఖ్యమంత్రి కెసిఆర్ బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ నిధులు భారీగా పెంచారని చెప్పారు. వైద్యారోగ్యశాఖ బడ్జెట్‌ను రూ. 6,295 కోట్ల నుంచి ఈసారి రూ. 11,440 కోట్లకు పెంచామని, మొత్తం బడ్జెట్‌లో 2.5 శాతం నుంచి 4.5 శాతానికి పెంచామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా రాలేదని, కానీ తమ ప్రభుత్వం నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసపత్రిలో నిర్మిస్తుందని, టిమ్స్ ఆసుపత్రిని 2 వేల పడకలు, నిమ్స్‌ను 40 ఎకరాల స్థలంలో 2 వేల పడకల స్థాయి ఆస్పత్రికి పెంచుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మెడికల్ సీట్లు పెరుగుతాయన్నారు. 70 ఏళ్లలో జరగనిది 7 ఏళ్లలో జరిగిందని అన్నారు. ప్రజారోగ్య రంగంలో సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, అందుకే అన్ని స్థాయిల్లో వసతులు పెంచామని చెప్పారు. డైట్, శానిటేషన్ ఛార్జీలు పెంచామని, త్వరలోనే బిల్డింగ్ మెంటైనేన్స్ కోసం నిధులు ఇస్తామని తెలిపారు.ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు మెరుగవుతున్నాయని, సిబ్బంది పనితీరు పెరగాలని అన్నారు.
నేను రిలాక్స్ కాను… మిమ్మల్ని రిలాక్స్ కానివ్వను
నేను రిలాక్స్ కాను…మిమ్మల్ని రిలాక్స్ కానివ్వను‘ అని వైద్యాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మా ర్పులు తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజలలో మరింత నమ్మకం కల్పించాలని అన్నారు. అందుకోసం ప్రభుత్వాసుపత్రులలో వసతులు, సౌకర్యాలు పెంచుతున్నామని చెప్పారు. ఆసుపత్రికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో సూపరింటెండెంట్‌లకు నిధులు ఇవ్వడంతోపాటు పూర్తి అధికారాలు ఇచ్చామన్నారు. అలాగే ప్రతి పిహెచ్‌సిలో డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులలో వైద్యులను నియమించుకునేలా ప్రభుత్వం కలెక్టర్లకే అధికారాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పనితీరుకు కేంద్రం అనేక అవార్డులు ఇచ్చిందని తెలిపారు. నీతి అయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో 3వ స్థానం ఉన్నాయని, కానీ మనం మొదటి స్థానానికి చేరుకోవాలన్నారు. క్వాలిటీ అస్సూరెన్స్‌లో నెంబర్‌వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో రెండు అవార్డులు వచ్చాయని అన్నారు.
సిజేరియన్లు తగ్గించాలి
రాష్ట్రంలో నార్మల్ డెలివరీలు పెరగాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తే ఇన్సెంటివ్ పెంచుతామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆసుపత్రులలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాల్సిందేనని గైనకాలజిస్ట్‌లకు మంత్రి ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ ల తీరు మారాలని అన్నారు. అవసరం లేకపోయినా సిజేరియన్ చేసే గైనకాలజిస్ట్‌ల అనుమతిని మెడికల్ కౌన్సిల్ ద్వారా రద్దు చేయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో సిసెక్షన్‌లపై ఆడిట్ నిర్వహిస్తామని, తగ్గకపోతే సంబంధిత డాక్టర్‌పై చర్యలు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో 54 శాతం డెలివరీ అవుతున్నాయని, 70 నుంచి 75 శాతానికి పెరగాలని అన్నారు. రాష్ట్రం లో ఎనీమియా ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో… కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేస్తామని తెలిపారు. 1.5 లక్షల మంది గర్భిణులకు అందిస్తామని పేర్కొన్నారు.
గాంధీలో 85 వేల కొవిడ్ రోగులకు చికిత్స
కరోనా సమయంలో గాంధీ వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజలకు వైద్య సేవలందించారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గాంధీలో సుమారు 85 వేల మంది కొవిడ్ రోగులకు చికిత్స అందించారని అన్నారు. గాంధీలో డెత్ రేట్ ఎక్కువ అని ప్రచారం చేస్తుంటారని, కానీ చివరి దశలో ఉన్నవారు, ప్రైవేట్ హాస్పిటళ్లు చేతులెత్తేసిన తర్వాత కూడా రోగులకు బతికించడానికి వైద్యులు కృషి చేస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. కొన్ని సార్లు ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు లేకపోయినా రోగులకు వరండాల్లో స్లైన్ ఎక్కించడం వంటి సంఘటనలు చూసినప్పుడు దానిని కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకుంటారని, కానీ హాస్పిటల్ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది వచ్చినా నిరాకరించకుండా చికిత్స అందిస్తున్నారనే కోణంలో చూడాలని అన్నారు. గాంధీ, ఉస్మానియా వంటివి కన్న తల్లిలా సేవలు చేస్తున్నాయని, రోగి ఎలా ఉన్నా.. ఎలాంటి స్థితిలో ఉన్నా అక్కున చేర్చుకుని వారికి వైద్యం అందిస్తున్నాయని తెలిపారు. క్రిటికల్‌గా ఉన్న పేషంట్లను కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చుకోరని, కానీ కొన ఊపిరి మీద ఉన్న వారిని కూడా ప్రభుత్వ ఆస్పత్రులు చేర్చుకుంటాయని అన్నారు.

Harish Rao speech at Gandhi Hospital Auditorium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News