Saturday, November 23, 2024

పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్ది..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట ః రాష్ట్రం అవతరించిన పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్దిని చేసుకున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రం అభివృద్దిలో దూసుకపోతూ యావత్తు దేశానికే దిక్చూచిగా నిలిచిందన్నారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగల మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తి పోతల ప్రాజెక్టు కాళేశ్వరం అని కేసీఆర్ పట్టుదలతో అనతి కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందన్నారు. కాళేశ్వరంతో గోదావరి జలాలు రావడంతో గుంట భూమి ఎండిపోకుండా రెండు పంటలు పండుతున్నాయన్నారు.

వ్యవసాయం అద్బుతంగా మారడంతోనే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పనుల కోసం మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు. రైతుబందు ,రైతు బీమా లాంటి పథకాలు అమలు చేయడంతోనే రైతులలో ఎంతో భరోసా కలిగిందన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో సైతం రైతులకు అండగా నిలిచింది ఏకైక బిఆర్‌ఎస్ సర్కార్ అన్నారు. తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధికమించిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించి వారి స్వయం సమృద్దికి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు. కరువుకాటకాలతో కటకటలాడిన ప్రాంతాలు నేడు కల్పతరువుగా మారాయన్నారు. నిరుపేదలకు స్వంత ఇంటి కలను నేరవేర్చింది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఆంద్రా పాలకుల హాయంలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు నేడు కళకళ లాడుతున్నాయన్నారు.

కేసీఆర్ ఆలోచనతో పల్లెల్లో అభివృద్ది వేగవంతం అవుతుందన్నారు. దీంతో జాతీయ, రాష్ట్రస్ధాయిలో ఆవార్డులు, రివార్డులలో పల్లెలు పోటీ పడుతున్నాయన్నారు. అబాగ్యులకు ఆసరాగా ఆసరా ఫించన్‌లను అందిస్తున్నామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా అత్యధిక ఫించన్లను తెలంగాణలో ఇస్తున్నామన్నారు. మహిళల ఆర్ధిక అభివృద్దిలో ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నామన్నారు.ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా రవాణా వ్యవస్ధను మెరుగుపరిచామన్నారు. నాలుగు దశాభ్ధాలుగా హామీగా నిలిచిన సిద్దిపేట రైలు అనే నినాదాన్ని కేసీఆర్ నేరవేర్చారన్నారు. త్వరలోనే సిద్దిపేటలో రైలు కూత వినబడనుందన్నారు. కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెలితే సగం రోగం నయం అయ్యేలా ఆసుపత్రులను తీర్చిదిద్దామన్నారు. దక్షణ భారత దేశంలోనే తొలి సారిగా రుతుప్రేమ కార్యక్రమాన్ని సిద్దిపేటలోనే స్వీకారం చుట్టామన్నారు.

జిల్లాలో 108 వాహానాల సంఖ్య 18 కి పెంచుకున్నామన్నారు. కేసీఆర్ ప్రత్యేక చోరవతో సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ప్రజా ప్రయోజనాలు మరింత సులభతరమయ్యాయన్నారు. జిల్లాలో మీషన్ కాకతీయ కింద చెరువులను అభివృద్ది పరుచుకున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐటీ టవర్‌ను సైతం ప్రారంభించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల విస్తరణ,నూతన రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులతో పర్యాటక శోభ సంతరించుకుందన్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామికి కీరిటాన్ని ఆలంకరించింది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. అందరి సహకారంతో జిల్లాను మరింత అభివృద్ది పథంలో ముందు ఉంచుతామన్నారు.

అంతకు ముందు జాతీయ ఎండాను ఎగురవేశారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , అదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్ , సీపీ శ్వేత తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News