కరీంనగర్: బిజెపి పార్టీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి రైతులు, సామాన్యులను బీజేపీ ప్రభుత్వం పీడిస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ఏడేండ్లు మంత్రిగా చేసి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఓట్ల కోసం ఈటల పచ్చి మోసపు మాటలు, అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు బాధ పడ్డా ఫరవాలేదు.. తనకు మాత్రం ఓటేయండని ఈటల చెప్తున్నాడని మండిపడ్డారు. బిజెపికి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల ఇప్పుడు మాట మార్చిండన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని.. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సిఎం కెసిఆర్ మా జీతాలు కోత పెట్టారని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Harish Rao Speech at Huzurabad Election Campaign