సిద్దిపేట: లక్షలాది ఎకరాలకు సాగునీరును అందించే అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్‌ను బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకే తలమానికం. మల్లన్న దేవుడు పుట్టిన రోజైన బుధవారం ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఈరోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. ఈ ప్రాజెక్టును ఆపాలని హైకోర్టులో, సుప్రీం కోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో 350 కేసులు వేశారు. కాని, నాలుగేళ్ల క్రితం ఇదే రోజు సుప్రీం కోర్టు అన్ని కేసులను కొట్టివేస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయి. ఈ ప్రాజెక్టు కానే కాదన్నరు. నీళ్లు రానేరావు అన్నరు. కానీ.. పట్టుదల ఉంటే కానిది ఏదీ ఉండదని ముఖ్యమంత్రి రుజువు చేశారు. అనతి కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామంటే ఎన్నో వేల గంటల ముఖ్యమంత్రి కృషి దాగున్నది. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడుతుందని ఈ స్థలాన్ని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఇక్కడికి నీళ్లు వస్తే సగం తెలంగాణకు నీళ్లు వస్తాయి. కరువు కాటకాలు దూరం చేయవచ్చని, కొన్ని వేల గంటలు ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి సీఎం కేసీఆర్ దీనికి డిజైన్ చేశారు. గతంలో కరువు కాటకాలకు నిలయం ఇక్కడి ప్రాంతాలు. గుక్కెడు తాగు నీళ్లు లేక, సాగునీరు లేక వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలికేంద్రాలు, గంజికేంద్రాలకు నిలయంగా ఉండేవి.
అలాంటి ఈ ప్రాంతానికి గోదారమ్మను తీసుకువచ్చి సస్యశ్యామలం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. నదిలేని చోట రిజర్వాయర్ కట్టారు. ప్రజల అవసరాలను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వందేళ్ల ముందు ఆలోచించి ఈ ప్రాంతంలో డిజైన్ చేసి పూర్తి చేశారు. ఎక్కడైనా నదికి అడ్డగా కడుతారు. కాని నది లేకపోయినా దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ను ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు తక్కువ సమయంలో కేవలం మూడున్నర సంవత్సరాల సమయంలో పూర్తి చేయడం జరిగింది. ఎన్నో అడ్డంకులు, ఎన్ని కేసులు పెట్టినా ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తూ..దిశానిర్దేశం చేస్తూ పూర్తి చేశారు. సమైక్య పాలనలో ఈ ప్రాంతంలో వానాకాలం కూడా ఎండకాలం లెక్కనే ఉంటుండే. వానాకాలం కూడా బిందెలు అడ్డం పెట్టేవారు. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండకాలం లెక్కనే ఉండే. కాని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏ కాలం చూసినా వానాకాలం లెక్కనే కనిపించే మార్పు వచ్చింది. మండుటెండల్లో సైతం రాష్ట్రంలో ఏ మూలకు పోయినా చెరువులు మత్తళ్లు దూకుతున్నయ్. చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నయ్.. ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా మారింది. ఇదంతా తెలంగాణ రావడం వల్లనే. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే సాధ్యమైంది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటేనే జీవితం ధన్యమైనంత గొప్ప అనుభూతి కలుగుతున్నది. పంపుల్లో నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరి నీళ్లను చూస్తే జన్మధన్యమైనంత సంతోషం కలిగింది. ఇంత అద్బుతమైన కార్యక్రమం ఈరోజు సిద్ధిపేటలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పది జిల్లాలకు మల్లన్న సాగర్ ఒక వరం. పది జిల్లాలకు జల ప్రసాదం ఈ ప్రాజెక్టు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చే అద్భుతమైన రిజర్వాయర్. జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
Harish Rao speech at Mallanna Sagar Inauguration