హైదరాబాద్: ఆరోగ్య, వైద్య రంగలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”సమైక్య రాష్ట్రంలో ఎంత కొట్లాడినా ఆంద్రాకు తప్ప, తెలంగాణలో మెడికల్ కాలేజీలు పెట్టలేదు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా.. గత పాలకులు హైదరాబాద్ వైద్య అవసరాలను గుర్తించలేదు. బ్రిటిష్ పాలనలో సైన్యం అవసరాలం కసం 200 ఏళ్ల కిందట గాంధీ ఆసుపత్రి, వందేళ్ల కింద కట్టిన ఉస్మానియా, ఎం.ఎన్.జే ఆసుపత్రి తప్ప, కొత్తది కట్టలేదు. సమైక్య పాలనలో కొత్త కార్పోరేట్ ఆసుపత్రులు మాత్రమే పుట్టగొడుగులా పుట్టాయి. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు ఆసుపత్రులు రావాలని ఆలోచించారు. ఇవాళ ఎల్బీనగర్, ఎర్రగడ్డ, అల్వాల్ లో మూడు ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ నేతలు, ఆంధ్రా పాలకులు ఉంటే ఎక్కడ ఏం దొరుకుతుందని చూసేవారు తప్ప. భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవారు కాదు. ప్రజల సోయి ఉండేది కాదు. అధికారులు, కాంట్రాక్టర్లు చెబితేనే పని చేసే వారు. కరోనా పరిస్థితులు క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. పేదలు కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఇది ఆలోచించి సీఎం ఈ ఒక్క రోజు కొత్తగా ఆరు వేల సూపర్ స్పెషాల్టీ పడకలు, వరంగల్ లో హెల్త్ సిటీలో మరో 1500 పడకలు.. ఇలా 7500 పడకలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. 3 వేల పడకలు ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి.
ప్రైవేటులో ఐసీయూకి వెళ్లే రోజుకు 50వేల నుండి లక్ష రూపాయలు బిల్లు వేస్తారు. ఇది హైదరాబాద్ జంట నగరాల ప్రజలతో పాటు, చుట్టూ ఉండే ఇతర జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇవాళ తెలంగాణలో 17 మెడికల్ కాలేజీలకు చేరుకుంది. రానున్న రెండేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయింది. 15వ ఆర్థిక సంఘం బస్తీదవాఖానాలు పేదలకు మంచి వైద్య సేవలు అందిస్తోందని దేశమంతా పెట్టాలని కొనియాడింది. ఇది బస్తీల్లో దవాఖానల సుస్తిని పొగొట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచించి హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా 350 బస్తీ దవాఖానాలు పెట్టించారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణను తొలి స్థానంలో నిలుపుతామని సీఎం కెసిఆర్ కు సవినయంగా విన్నవిస్తున్నా” అని పేర్కొన్నారు.
Harish Rao Speech at TRS Sabha in Alwal