Thursday, November 21, 2024

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ చారిత్రక సందర్భంలో జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత సింగ్‌, సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ వంటి చిరస్మరణీయులతో పాటుగా దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ త్యాగ ధనులందరికీ వినమ్రమైన జోహర్లు అర్పిస్తున్నానని తెలిపారు.. వారి స్పూర్థితోనే నాటి ఉద్యమ నేత, నేటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని, పసి రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే తెలంగాణలో నూరేళ్ల అభివృద్ధి వేళ్లూనుకుందని, మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయని చెప్పడంలో తనకు ఎలాంటి అతిశయోక్తి లేదని, తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్‌గా చెప్పుకున్న నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసుకున్నామని, అదే మార్గంలో సిద్దిపేట ట్యాగ్‌లైన్‌గా భావించిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాన్ని సాధించుకున్నామని నేటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున చెప్పుకోవడం గర్వంగా ఉందని ప్రశంసించారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా చేపట్టిన అనేక ఆదర్శవంతమైన కార్యక్రమాలతో మన జిల్లా ముఖచిత్రం మురిసిపోతున్నది. అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి తెలంగాణ ప్రభుత్వం మన జిల్లాలో చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతుల రుణమాపీ:

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో ముందడుగు వేసింది. 99 వేల 999 రూపాయల వరకు మన జిల్లాలో 81 వేల 565 మందికి 418 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని చెప్పడం చాలా సంతోష పడాల్సిన విషయం. మన జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు, పెరిగిన భూగర్భ జలాల వల్లే ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. 50వేల ఎకరాల లక్ష్యంగా ప్రారంభమై ప్రస్తుతం 10వేల ఎకరాలకు చేరడమే గాకుండా ఆయిల్‌పామ్‌ సాగును ప్రొత్సహించడానికి నంగునూరు మండలం నర్మెటలో 300కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీని కూడా నిర్మించుకోవడం జరుగుతోంది.

జిల్లా కేంద్రం.. ప్రజలకు ప్రయోజనం

తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే సిద్దిపేట జిల్లా ఆవిర్బవిస్తుందని గౌరవ కేసీఆర్‌ గారు పదేపదే ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు అన్నట్లుగానే నాలుగు దశాబ్దాల కలను సాకారం చేస్తూ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. వ్యయప్రయాసలతో సంగారెడ్డికి పోయివచ్చే బాధల నుండి ఈ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించారు. జిల్లాతో పాటు గజ్వేల్‌, హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలనాపరమైన సంస్కరణలతో ప్రజాప్రయోజనాలకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. నాడు గంటల కొద్దీ ప్రయాణం చేసి సంగారెడ్డికి రాకపోకలు చేసినవాళ్లు నేడు నిమిషాల వ్యవధిలోనే అన్ని కార్యాలయాలకు చేరువ కావడమనేది మనం సాధించుకున్న గొప్ప విజయంగా చెప్పవచ్చు.

 

భగీరథ సాకారం.. తీరిన దాహం

తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచింది. 2014 సంవత్సరానికి ముందు సిద్దిపేట జిల్లాలో కేవలం 4వేల 400 నల్లా కనెక్షన్లు ఉండగా.. మిషన్‌ భగీరథ ద్వారా నేడు 2లక్షల 32వేల నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికీ స్వచ్చమైన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతున్నది. త్వరలోనే మల్లన్నసాగర్‌ నుండి సిద్దిపేట ప్రాంతానికి శుద్దమైన గోదావరి జలాలను మంచినీటిగా అందించడానికి వాటర్‌ రింగ్‌ మెయిన్‌ను యుద్దప్రాతిపదికన నిర్మించుకుంటున్నాం.

కులవృత్తులకు చేయూత..

కులవృత్తులను ప్రొత్సహించి వారు స్వయం సమృద్ది సాధించేలా అనేక పథకాలను మన ప్రభుత్వం చేపట్టింది. గొల్లకుర్మలకు ప్రభుత్వ సబ్సిడీతో ఇప్పటికే 15వేల 720 మందికి గొర్రెలను పంపిణీ చేయగా.. రెండో విడతలో మరో 17వేల మందికి లబ్ది చేకూర్చడానికి ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయడం జరుగుతున్నది. జిల్లాలోని 3 వేల 711 మంది మత్స్యకారులకు సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు, చేపల అమ్మకం యూనిట్లను అందించడం జరిగింది. 281 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలలో 20వేల 350 మంది నమోదై జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో 3 కోట్ల 92లక్షల చేప పిల్లలను వదలగా రికార్డు స్థాయిలో 18వేల 700 టన్నుల చేపల దిగుబడి వచ్చింది. నాయి బ్రాహ్మణులు, రజకులను ప్రొత్సహించడం వల్ల వారి స్వయం ఉపాధి పెరిగింది. కుమ్మరుల అభివృద్ది కొరకు మట్టి పాత్రలను తయారుచేయడానికి జిల్లాలో ట్రెయినింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. వెనుకబడిన వర్గాల కులవృత్తుల ప్రొత్సాహం కొరకు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన బీసీ బంధు పథకాన్ని చేపట్టి అర్హులందరికీ లక్ష రూపాయల చొప్పున అందజేయడం జరుగుతున్నది.

ఇటు గోదాములు.. అటు సమీకృత మార్కెట్లు

పంటలు పండించడంలోనే కాదు. ఆ పంట దిగుబడులను విక్రయించడంలోనూ మార్కెటింగ్‌ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంలో మనం ముందున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 41వేల 650 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 34 గోదాములు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఒక లక్షా 5వేల మెటిక్ర్‌ టన్నుల సామర్థ్యంతో కొత్తగా 26 గోదాములను నిర్మించుకోవడం జరిగింది. సిద్దిపేటలో మాడల్‌ రైతు బజార్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, గజ్వేల్‌లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లను ఏర్పాటు చేసుకున్నాం. దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో 25కోట్ల రూపాయల నిధులతో మరో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు వేగంగా చేపట్టడం జరిగింది.

సాఫ్ట్‌వేర్‌ కొలువులు.. పారిశ్రామిక ఫలాలు

మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ టవర్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను మన సిద్దిపేటలోనూ ఆవిష్కరించుకున్నామని చెప్పడం నాకు గర్వంగా ఉంది. 63 కోట్ల రూపాయలతో నిర్మించిన సిద్దిపేట ఐటీ టవర్‌లో మన జిల్లాకు చెందిన యువతీ,యువకులకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రావడం చాలా సంతోషమైన విషయం. నేడు రెండు షిప్టుల్లో 800 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు విధులు నిర్వహించడం జరుగుతున్నది. పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంలోనూ దూరదృష్టితో అలోచించడం జరిగింది. ఆ ఫలితంగానే జిల్లాలో 665 కోట్ల రూపాయలతో 20 భారీ పరిశ్రమలు, 92 కోట్లతో 13 మధ్యతరహా పరిశ్రమలు, 259 కోట్ల రూపాయలతో 631 చిన్నతరహా మరియు కుటీర పరిశ్రమలను స్థాపించి దాదాపు 23వేల మందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది. సిద్దిపేటలోని పారిశ్రామికవాడలో ఆటోనగర్‌ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్‌లకు స్థలాలను అందజేయడం జరుగుతున్నది.

గమ్యం చేరుతున్న సొంతింటి కల

అర్హులైన పేదవాళ్లకు సొంతింటి కలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నది. నాడు పేదల ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వాలు నామమాత్రంగా సాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాము. కానీ నేడు పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మన జిల్లాలో ఇప్పటి వరకు 802కోట్ల రూపాయల వ్యయంతో 15వేల 929 ఇండ్లు మంజూరు కాగా 10వేల 122 ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్దిదారులకు అందించడం జరిగింది. గృహలక్ష్మీ పథకం ద్వారా సొంతింటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరపున నిరుపేదలకు అందించడానికి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతున్నది. అత్యంత పారదర్శకంగా అర్హులైన లబ్దిదారులకు ఈ సాయం అందుతుంది.

ప్రగతి బాటలో పల్లెలు..

ఆంధ్రాపాలకుల హయాంలో కన్నీళ్లు పెట్టిన తెలంగాణ పల్లెలు నేడు కళకళలాడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆలోచనతో పురుడుపోసుకున్న పల్లె ప్రగతి ప్రభావంతో జిల్లాలోని 499 గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కిందంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌తో మన పల్లెలన్నీ ఆదర్శంగా నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుతోనే సాధ్యమైందని చెప్పకతప్పదు. ఏ పల్లెకు వెళ్లినా రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, డంపుయార్డులు, పల్లెప్రకృతి వనాలు, వన నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి. చెత్తాచెదారం లేని స్వఛ్చమైన పల్లెలుగా మారడమే గాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడి అవార్డులు, రివార్డులు గెల్చుకుంటున్నాయనే విషయం మనందరికీ తెలుసు. పల్లెల సర్వతోముఖాభివృద్దిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

పట్టణాలకు మహర్దశ..

జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాలను సమగ్ర పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతోంది. సిద్దిపేట మునిసిపాలిటీలో 301 కోట్ల రూపాయలతో భూగర్బ డ్రైనేజీని నిర్మించుకున్నాం. ఇది సిద్దిపేట ప్రజల ఆరోగ్య రక్షణకు వందేళ్ల భరోసాగా నిలవబోతున్నది. తడి,పొడి, హానికర చెత్తలను వేర్వేరుగా సేకరించి తడిచెత్తతో సీఎన్‌జీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నాం. అదే విధంగా సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టడం జరిగింది. చెత్త ద్వారా ఉత్పత్తయిన వాటితో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రతీఏటా 37లక్షల రూపాయలు సమకూరుతున్నాయి. గజ్వేల్‌ పట్టణంలోనూ 155 కోట్ల రూపాయలతో చేపట్టిన భూగర్బ డ్రైనేజీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. చేర్యాలలో 22 కోట్ల రూపాయలు, దుబ్బాకలో 30 కోట్ల రూపాయలు, హుస్నాబాద్‌లో 38కోట్ల రూపాయలతో మంజూరైన అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయి.

అభాగ్యులకు ఆసరా పింఛన్లు..

అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదని అంటారు. కానీ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు అడగకముందే అభాగ్యుల కోసం అన్నీ చేస్తున్నారు. పేద ప్రజల కన్నీరు తూడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించే మానవతా దృక్పథంతో ఆసరా పింఛన్లను అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని పింఛన్లను కొన్ని వర్గాలకే అందించే పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులతోపాటుగా ఎయిడ్స్‌, పైలేరియా, డయాలసిస్‌ బాధితులను కూడా అక్కున చేర్చుకొని పింఛన్లు అందజేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతున్నది. 2013వ సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా కేవలం ఒక లక్షా 29వేల మందికి 200 రూపాయల చొప్పున 3కోట్ల 39లక్షల రూపాయలను మాత్రమే ప్రతీనెల పింఛన్లు అందించగా.. నేడు ఒక లక్షా 92వేల మందికి ప్రతీనెల 40కోట్ల రూపాయలను ఫింఛన్‌ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. దివ్యాంగులకు 4వేల 16 రూపాయలు, మిగితా వర్గాలకు 2వేల 16 రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అతివల ఆర్థిక పురోగతి..

మహిళల ఆర్థిక అభివృద్ధిలో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2013లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6వేల 993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77లక్షల రూపాయలు మంజూరు చేయగా.. నేడు 11వేల 699 సంఘాలకు 602 కోట్ల 47లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది. శ్రీనిధి ద్వారా జిల్లాలో 2 వేల 998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15లక్షల రూపాయలను మంజూరు చేసుకొని అక్కాచెల్లెళ్లకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలోనూ గడిచిన తొమ్మిదేళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది.

రోడ్డు మారింది.. రవాణా మెరుగైంది..

రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రజల జీవనప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 19 వందల 61 కిలోమీటర్ల నిడివి గల పంచాయతీ రాజ్‌ రహదారులు ఉండగా ప్రస్తుతం 26వందల 52 కిలోమీటర్లకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదే విధంగా 990 కిలోమీటర్ల నిడివి గల ఆర్‌అండ్‌బి రహదారులను 12 వందల 08 కిలోమీటర్లకు విస్తరించుకొని రవాణా వ్యవస్థను మెరుగుపర్చుకున్నాము. రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 297 కోట్ల రూపాయలతో గజ్వేల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయ్యి నేడు అందుబాటులోకి వచ్చింది. 160 కోట్ల రూపాయలతో సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగు రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 172 కోట్ల రూపాయలతో సిద్దిపేట నుండి కిష్టాపూర్‌ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రం మీదుగా మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి, సిరిసిల్ల-జనగామ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది.

చుక్‌చుక్‌ రైలు వచ్చేస్తుంది..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే సిద్దిపేట ప్రజలకు మూడు ప్రధానమైన చిరకాల ఆకాంక్షలను నెరవేర్చడం జరిగింది. నాలుగుదశాబ్దాల నుండి హామీలుగా నిలుస్తున్న ప్రతిష్టాత్మకమైన పనులు గమ్యం చేరాయంటే ముమ్మాటికీ సొంత రాష్ట్రం సిద్దించడం, కేసీఆర్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లేనని చెప్పకతప్పదు. సిద్దిపేట జిల్లా ఆవిర్భవించడంతో మొదటి హామీ పరిష్కారం కాగా.. రెండవ ఆకాంక్ష కాళేశ్వర ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సాగునీటి, తాగునీటి కష్టాలు పూర్తిగా గట్టెక్కాయి. ఇక రైలు సౌకర్యం ఒక్కటే మిగిలి ఉంది. ఇప్పటికే సిద్దిపేట రైల్వేస్టేషన్‌ వరకు ట్రాక్‌ నిర్మాణం పూర్తికావొచ్చింది. కొద్ది రోజుల్లోనే మన సిద్దిపేటలో రైలు కూత మార్మోగనున్నదనే విషయం అబ్బురపరుస్తున్నది.

కార్పోరేట్‌ వైద్యసేవలు.. ఉచితంగానే అమలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగుపెట్టగానే సగం రోగం మాయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నాం. కార్పోరేట్‌ ఆస్పత్రులను మైమరిపించేలా మన సర్కారు ఆస్పత్రులను తీర్చిదిద్దుకున్నాం. సొంత రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 370 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు 1172 పడకలతోపాటు త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో మరో 950 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే జిల్లాలో ఎనిమిది బస్తీ దవాఖానాలను, 108 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసుకున్నాం. సాధారణ జ్వరం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధిని నయం చేసే చికిత్సలను ఉచితంగా అందించడంలో మంచి ఫలితాలను సాధించుకోవడం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 5లక్షల 20వేల మందిని పరీక్షించి 1లక్షా 70వేల మందికి కంటి అద్దాలను అందించడం జరిగింది.

55వేల 715 మంది లబ్దిదారులకు 45 కోట్ల 38లక్షల రూపాయల వ్యయంతో కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అమ్మాయి జన్మిస్తే 13వేల రూపాయలు, అబ్బాయి జన్మిస్తే 12వేల రూపాయలను అందించుకోవడం జరుగుతున్నది. మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించగా అందులో 13 కేంద్రాలు సిద్దిపేట జిల్లాలోనే ఉండగా మరో 4 కేంద్రాలను అదనంగా ప్రారంభించడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రుతుప్రేమ కార్యక్రమాన్ని మన సిద్దిపేటలో శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం నెలసరి సమయంలో శానిటరీ కప్పులను వినియోగించడానికి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 20వేల మంది మహిళలకు అవగాహన కల్పించి 38వేల మందికి శానిటరీ కప్పులను ఉచితంగా అందజేయడం జరిగింది. మన జిల్లా ఏర్పాటుకు ముందు కేవలం నాలుగు 108 వాహనాలు మాత్రమే ఉండగా నేడు పద్దెనిమిది 108 వాహనాలు అందుబాటులో ఉండడం వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించుకోవడం జరుగుతున్నది. అదే విధంగా 50 పడకలతో కొత్తగా ఆయూష్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతానికి మించి డెలివరీలు జరిగేవి కాదు. నేడు వైద్య సంస్కరణల మూలంగా 78 శాతం డెలివరీలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరుగుతున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. దీనికి కారణమైన వైద్యాధికారులు, వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

సిద్దిపేటతోపాటుగా దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ ఆస్పత్రులలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నాము. గజ్వేల్‌, హుస్నాబాద్‌ పట్టణాల్లో మాతా శిశు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రస్తుతం 850 మంది విద్యార్థులకు వైద్యవిద్య అందించడం జరుగుతున్నది. ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతీ ఏటా 150 మంది ఇదే విధంగా అందుబాటులో ఉండడం వల్ల వైద్యుల కొరతకు పరిష్కారం లభించింది. కొత్తగా పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడిసిన్‌ కోర్సుల్లో 62 మంది విద్యార్థులు చేరడం జరిగింది. వైద్యులతో పాటు నర్సుల కొరతను తీర్చడానికి సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రస్తుతం 200 మంది నర్సింగ్‌ విద్యార్థినులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఈ కాలేజీ కోసం 40కోట్ల రూపాయలతో శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతున్నది.

సర్కారు బడుల సర్వతోముఖాభివృద్ధి..

సమైక్య రాష్ట్రంలో అరకొర సౌకర్యాలు, ఇరుకైన తరగతి గదులు, శిథిలావస్థలో ఉన్న భవనాలతో అస్తవ్యస్థంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నేడు ఉజ్వలమైన స్థితిలో వెలుగులు ప్రసరిస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రభుత్వ విద్యను ప్రగతిశీల మార్గంలో పయనింపచేస్తున్నారు. మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. జిల్లాలో 979 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 584పాఠశాలలను ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 46కోట్ల 48లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల సమగ్రమైన అభివృద్ధి ఫలితంగా.. పదో తరగతి ఫలితాల్లోనూ మన జిల్లా అగ్రస్థానానికి చేరిందనడం మనందరికీ గర్వకారణం. గత ఏడాది 97.85 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది 98.65 శాతంతో ఉత్తీర్ణత పెరిగినప్పటికీ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఈ విజయానికి కారకులైన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– 2014వ సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 8 ఎస్సీ, ఒక బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవి. ఆనాడు కేవలం 5 వేల 600 మంది విద్యార్థులకు ఈ గురుకులాల్లో చదువుకునే అవకాశం దక్కేది. కానీ తెలంగాణ ఏర్పాటైన వెంటనే గురుకులాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో 16 ఎస్సీ, 11 బీసీ, 6మైనారిటీ ఒక ఎస్టీ గురుకుల విద్యాలయాలు ఉండగా 19వేల 240 మందికి ఉచితంగా వసతి, భోజనం కల్పించి మెరుగైన విద్యను అందజేస్తున్నాము.

నిరంతరం.. విద్యుత సంబరం

దేశంలో ఏ రాష్ర్టానికి కూడా సాధ్యం కాని విధంగా వ్యవసాయానికి 24గంటల పాటు నిరంతర విద్యుతను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కావడం గర్వంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 54వేల మంది రైతులకు లబ్ది జరుగుతున్నది. సొంత రాష్ట్రంలో పవర్‌ హాలీడే, క్రాప్‌ హాలీడే అనే మాటలను మరచిపోయాము. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుతను నిరంతరంగా సరఫరా చేసుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకముందు మన జిల్లాలో 113 సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం 180 సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. 25 కోట్ల రూపాయలతో 288 కి.మీల 33కె.వి లైన్లను, మరో 27 కోట్ల రూపాయలతో పట్టణాలలో డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్లు, స్తంబాలను ఏర్పాటు చేయడం జరిగింది.

క్రీడలకు పట్టం.. క్రీడాకారులకు ప్రొత్సాహం

– పల్లెలు, పట్టణాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్‌ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆటలపోటీలు నిర్వహించింది. మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులను ప్రొత్సహించేలా 11 రకాల క్రీడలను నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో 6వేల 159 మంది, జిల్లా స్థాయి క్రీడల్లో 14 వందల 56 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 16 క్రీడాంశాలకు సంబంధించిన వసతులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుకోవడం జరిగింది. వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు అకాడమీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన పోస్టులు సైతం మంజూరయ్యాయి.

పర్యాటక సొబగులు.. ఆధ్యాత్మిక వెలుగులు

– ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక రంగం గురించి పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. కానీ నేడు తెలంగాణ పర్యాటకం దేశాన్ని ఆకర్షిస్తున్నది. అదే బాటలో సిద్దిపేట జిల్లాలోని పర్యాటక శోభ నలుదిశలా విరాజిల్లుతున్నది. భూతల స్వర్గాన్ని తలపించేలా మన సిద్దిపేట కోమటిచెరువును కోటి అందాల చెరువుగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. త్వరలోనే ఇక్కడ శిల్పారామం, డైనోసర్‌ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. గజ్వేల్‌లోని పాండవుల చెరువు, హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు, దుబ్బాకలోని రామసముద్రం చెరువులను ఆహ్లాదకరంగా ముస్తాబు చేసుకున్నాం. సాగునీటి దేవాలయాలుగా కీర్తించబడుతున్న రంగనాయకసాగర్‌, శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లు పర్యాటక కేంద్రాలుగా వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను అత్యద్భుతంగా సుందరీకరించేలా పనులు జరుగుతున్నాయి.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు అద్దం పడుతున్న కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మల్లన్న స్వామికి బంగారు కిరీటాన్ని అలంకరించిన ప్రభుత్వం కూడా మనదే. మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోయగానే ఆ నీళ్లతో కొమురవెల్లి మల్లన్న పాదాలు కడిగిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. కొండపోచమ్మ ఆలయం, నాచారం లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, సిద్దిపేటలోని కోటిలింగాల, బుగ్గరాజేశ్వరస్వామి, పుల్లూరు లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, జగదేవ్‌పూర్‌లోని వరదరాజ స్వామి ఆలయం, దుబ్బాక రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మన సిద్దిపేటలో నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు అంగీకరించడంతో మరో ఆధ్యాత్మిక కలికితురాయి మన కళ్లముందు సాక్షాత్కరించబోతున్నది.

పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ..

శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘీక కార్యక్రమాల నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం సుస్థిరమైన మార్గాన్ని అనుసరిస్తున్నది. ఈ క్రమంలోనే పోలీసు శాఖను పటిష్టం చేయడంతోపాటు ఆధునిక సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలను కల్పిస్తున్నది. పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతున్నది. అంతేగాకుండా నిరుద్యోగులైన యువతి,యువకులకు ఎస్‌.ఐ మరియు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన ఉచిత శిక్షణను మన సిద్దిపేట జిల్లాలో అందించాము. ఉచిత శిక్షణ ద్వారా దాదాపు 300 మంది పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి సిద్దిపేట ప్రాంతంలో ఒక ఏసీపీ కార్యాలయం, 10 పోలీస్‌ స్టేషన్లు, ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, 300 మంది సిబ్బంది మాత్రమే ఉన్న విషయం మీకందరికీ తెలుసు. సొంత రాష్ట్రం సాకారం కాగానే పోలీసు కమిషనరేట్‌ హోదాతోపాటు గజ్వేల్‌, హుస్నాబాద్‌లో ఏసీపీ కార్యాలయాలు, 26 పోలీస్‌ స్టేషన్లు, మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడమేగాకుండా సైబర్‌ క్రైమ్‌, ఐటీ కోర్‌ విభాగం, పెట్రోలింగ్‌ విధానం ద్వారా శాంతిభద్రతలను మరింతగా పరిరక్షించడం జరుగుతున్నది. ఓ వైపు శాంతి భద్రతలతో పాటు మరో వైపు ఆరోగ్య భద్రతను పరిరక్షించేలా హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం.

దశాబ్ది కాలంలోనే శతాబ్దపు కీర్తిప్రతిష్టలను సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలుస్తున్నది. 76 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ విరాజిల్లుతున్నది. అదే స్పూర్థితో ముందుకెళ్తున్న మన సిద్దిపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతులు సిద్దిస్తున్నాయి. ప్రజల మనసెరిగి పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా ఉంటున్నాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమీషనర్‌ మరియు వారివారి అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకరిస్తున్న ప్రింట్‌ మరియు ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని అభినందిస్తూ మరోసారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News