Friday, December 20, 2024

బిజెపి పాలిత రాష్ట్రాలో రూ.3000 పెన్షన్ ఇస్తున్నారా?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మునుగోడు: తండాలను గ్రామ పంచాయితీలుగా చేయాలని గిరిజన సోదరులు ఎన్ని సార్లు అడిగిన గతంలో  టిడిపి, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిఎం కెసిఆర్ తండాలను గ్రామా పంచాయితీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారని ప్రశంసించారు. ఎంబిబిఎస్ లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ తీసుకవచ్చామని, 6615 ఎంబిబిఎస్ సీట్లలో 661 సీట్లు ఎస్టిలకు కేటాయించామన్నారు.  ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో సిఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అని కొనియాడారు. విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పిచడంతో మంచి అవకాశాలు వస్తున్నాయని, ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాది లోపు ఇచ్చిన మాటలన్ని అమలు చేస్తామని, ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత తనదన్నారు.

బిజెపి గెలిస్తే రూ. 3000 పెన్షన్ ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, మోడీ సొంత రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని, అక్కడ ఎందుకు రూ. 700 పెన్షన్ ఇస్తున్నారని హరీష్ రావు అడిగారు. బిజెపి పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రూ. 600 పెన్షన్ ఇస్తున్నారని, తెలంగాణలో మూడు వేల రూపాయలు ఎలా ఇస్తారని అడిగారు. రాజగోపాల్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడన్నారని ఎద్దేవా చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ. 3000 పెన్షన్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు కరెంట్ వచ్చిందని, రూ.200 పెన్షన్ రూ.2000 చేశామని, కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు, రైతుభీమా, తీసుకొచ్చామన్నారు.

తెలంగాణలో భూమికి బరువైన పంట పండుతుందని, తెలంగాణలో గింజ మిగలకుండా కొన్నామని, కళ్యాణ లక్ష్మీ, కెసిఆర్ కిట్ ఇవన్నీ ప్రజల కండ్ల ముందే జరుగుతున్నవని నిజంకాదా? అని హరీష్ రావు అడిగారు. మునుగోడు నియోజకవర్గానికి 1000 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండానే పోయిందని, బిజెపి మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తుందన్నారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటారా? అభివృద్ధి చేసే టిఆర్ఎస్ ని గెలిపిస్తారా? అని ప్రజలను హరీష్ రావు అడిగారు. ఆగం కాకుండా మొదటి డబ్బా మీద 2 నంబర్ బటన్ కారు గుర్తు అని, ప్రభాకర్ రెడ్డి ఫోటో మీద ఓటు వేసి దీవించాలని కోరారు. బాధ్యత తీసుకొని మర్రిగూడలోని రాజ్ పేట్ తండాను అభివృద్ధి చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News