Saturday, November 23, 2024

అమరుల త్యాగం వెల కట్టలేనిది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు…

సిద్దిపేట: స్వాతంత్రోద్యమానికి ముందు నుంచే పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీస్ రావు తెలిపారు. మహాకవి దాశరధి కీర్తించినట్లుగా “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని, ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద, మన వారసత్వమని, స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి పదవులను త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సుదీర్ఘముగా నడిపించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని సగర్వంగా చెబుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరములు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భములో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్శక, విద్యార్థినీ, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగించారు.

వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయినందున వారి కుటుంబాలకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదేనని, అమరుల త్యాగం వెల కట్టలేనిదని, అమరులైన తెలంగాణ బిడ్డలకు ఈ సందర్భంగా  జోహార్లు అర్పిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని, తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యిందని ప్రశంసించారు.

తెలంగాణ సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సాధికారత కలిగిన ఉద్యమ సారథినే, స్వరాష్ట్ర రథసారథిగా ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను వారి భుజస్కంధాల పైనే మోపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలు తమపై ప్రకటించిన విశ్వాసాన్ని వందకు వంద శాతం నిలబెట్టుకుంటూ, ఆనాడు ఎంతటి నిబద్ధతతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారో, అంతే నిబద్దతతో ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. పోరాట దశ నుంచి, రాష్ట్ర ఆవిర్భావం వరకు, నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కండ్ల ముందే జరిగిన, జరుగుతున్న అద్భుత చరిత్ర అని, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముందు చూపుతో రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి చేయూతనివ్వడం అందరి బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలి అని, అప్పుడే మనం కలలు కంటున్న బంగారు తెలంగాణ సుసాధ్యం చేసుకోగలమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ది పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.

1. వ్యవసాయ శాఖ:

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన 2014 – 15 సంవత్సరంలో జిల్లాలో 6 లక్షల 63 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేసి 11 లక్షల 59 వేల టన్నుల ఉత్పత్తి సాదించగా, 2021-22 సంవత్సరంలో 8 లక్షల 61 వేల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేసి 16 లక్షల 72 వేల టన్నుల ఉత్పత్తి సాదించబడినది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు వలన వ్యవసాయ రంగంలో జరిగిన గణనీయమైన అభివృద్ధికి ఇది నిదర్శనం. రైతు బంధు పధకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం కొరకు ఇప్పటి వరకు జిల్లాలో 2 వేల 140 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భీమా పథకము ద్వారా ఏకారణంగానైన రైతు మరణిస్తే ఆ కుటుంబమునకు 5 లక్షల రూపాయలు ఉచిత భీమా అందుతుంది. దీనికి కావలసిన ప్రీమియం మొత్తమును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2021-22 సంవత్సరమునకి గాను జిల్లాలోని 1 లక్ష 79 వేల 85 మంది రైతులను అర్హులుగా గుర్తించడం జరిగినది. జిల్లాలో ఇప్పటివరకు మరణించిన 653 మంది రైతుల కుటుంబాలకు 32 కోట్ల 65 లక్షల రూపాయల భీమా సొమ్ము అందజేయడం జరిగింది.

2. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ:

జిల్లాలో కాళేశ్వర జలాలు పుష్కలముగా లభ్యమవుతున్న తరుణములో ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగును 50 వేల 585 ఎకరముల విస్తీర్ణములో సాగు చేయుటకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత సంవత్సరంలో 650 మంది రైతులను గుర్తించి 3 వేల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికముగా జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు 27 వేల ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదము ఇవ్వగా ఇప్పటి వరకు 8 వేల 250 ఎకరాలలో సాగు చేయడం జరిగింది.

2014 సంవత్సరమునకు ముందు కేవలం 30 ఎకరాలలో మల్బరీ సాగు చేయగా ప్రస్తుతం 790 ఎకరాల విస్తీర్ణంలో పట్టు సాగు చేస్తూ 297 కుటుంబాలు ప్రతి రెండు ఎకరాలలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల నికర ఆదాయమును పొందుతున్నాయి.

జిల్లాలో 2021-22 సంవత్సరములో చందులాపూర్ క్లస్టర్ ఏర్పాటు చేసుకొని 200 ఎకరాలలో మరియు నాన్ క్లస్టర్ లో 200 ఎకరాలలో మల్బరి సాగు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో 4 వేల స్ప్రింక్లర్లు మరియు 4 వేల 500 ఎకరాలకు బిందుసేద్య పరికరాలను రైతులకు ఇవ్వడం వలన పండ్లు, కూరగాయలు పండిస్తూ 30 నుండి 50 శాతం అధిక దిగుబడిని పొందుతున్నారు.

3. మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి:

తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు డిజిటల్ తరగతి గదులు, మరమ్మత్తులు, అవసరమైన ఫర్నిచర్, మరుగుదొడ్లు, డిజిటల్ తరగతి గదులు మరియు త్రాగునీటి వసతి వంటి 12 అంశాలతో మౌళిక వసతులను కల్పించడం ద్వారా మౌళిక సదుపాయలు సమగ్ర అభివృద్ది కోసం మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో అన్నీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విధ్యాభోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాలలకు మౌళిక సదుపాయలను కల్పించడం ద్వారా విద్యార్థులకు అనుకూలమైన, అభ్యాసన వాతావరణం సృష్టించబడి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన నమోదు, హాజరు మరియు నిలుపుదల రేటు సాధించబడుతుంది.
ఈ కార్యక్రమం మొదటి దశలో భాగముగా జిల్లాలోని అత్యధిక సంఖ్య కల్గిన 343 పాఠశాలలను 89 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చె విధ్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడాన్ని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని 3 వేల 600 మంది ఉపాద్యాయులను సంసిద్దులను చేయడం కొరకు ఆంగ్లంలో భోధనపై SCERT హైదరాబాద్ ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

4. తెలంగాణ దళిత బంధు:

భారత రత్న డా, బి. ఆర్. అంబేద్కర్ గారి ఆశయాల స్పూర్తితో దళిత జాతి ఆర్ధిక ప్రగతి లక్ష్యంగా మన ముఖ్య మంత్రి గౌ,, శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గారు దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమమును ప్రవేశపెట్టినారు. దళిత బంధు కేవలం ఒక పధకం మాత్రమే కాదు, దళితులకు ఉపాదిని, ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని వికాసాన్ని చేకూర్చు ఒక దృక్పథం. ఈ పధకం ద్వారా ప్రతి కుటుంబం వారి ఆసక్తి అనుభవం, నైపుణ్యం ఆధారంగా స్వయం ఉపాధి పథాకాలను ఎంపిక చేసుకొనే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. దళితబంధు ద్వారా లబ్ది పొందిన కుటుంబ ఏదైనా ఆపదకు గురి అయినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి దిగజారి పోకూడదు ఇందుకోసమే “దళిత రక్షణ నిధి” ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపద సమయములో ఈ నిధి కవచముగా నిలుస్తుంది.
జిల్లాలో దళితబంధు పథకం ద్వారా (6) నియోజక వర్గములలో ఇప్పటి వరకు 495 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున 49 కోట్ల 50 లక్షల రూపాయలతో వివిధ రకములైన మినీ డైరీ, పౌల్ట్రీ ఫారం, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, మొబైల్ టిఫిన్ సెంటర్లు మొదలగు పధకములను ఇవ్వడం జరిగింది.

5. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ:

జిల్లాలో రైతులు పండిన దాన్యం నిల్వచేయుట కొరకు 26 గోదాములు నిర్మించడం జరిగింది. జిల్లాలోని సిద్దిపేట మరియు గజ్వేల్ పట్టణములలో సమీకృత మార్కెట్లను మరియు రైతు బజార్లను నిర్మించడం జరిగింది. మిర్చి పండించు రైతుల కొరకు చిన్న కోడూర్ లోని గంగాపూర్ నందు మిర్చి మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగదేవ్ పూర్, చిన్నకోడూర్ మరియు దుబ్బాక మండల కేంద్రములలో కూరగాయల మార్కెట్ ను నిర్మించడం జరిగింది. చేర్యాల మరియు హుస్నాబాద్ లలో రైతు బజార్లను నిర్మించడం జరుగుతున్నది. గజ్వేల్ లో పత్తి రైతుల కొరకు 22 ఎకరాలలో అధునాతన మార్కెట్ నిర్మాణం 2 కోట్ల 24 లక్షల రూపాయల వ్యయం తో నిర్మాణ పనులు జరుగుతున్నది.

6. నీటి పారుదల శాఖ :

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమైన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతాంగానికి సాగు నీరు అందించేందుకు జిల్లాలోని శ్రీరంగనాయక సాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 3 టి.యంసి లకు ప్రస్తుతము 1.77 టి.యంసి లు, శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ సామర్ద్యము 50 టి.యం.సి.లు కాగా ప్రస్తుతం 14.43 టి.యం.సి.లు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 15 టి.యం.సి.లు కాగా ప్రస్తుతం 5.12 టి.యంసిలు, అనంతగిరి రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టి.యం.సి.లు కాగా ప్రస్తుతం 2.56 టి.యం.సి.లు మరియు శనిగరం ప్రాజెక్ట్ సామర్థ్యం 1.092 టి.యంసిలు కాగా ప్రస్తుతం 0.665 టి.యంసిల నీరు నిల్వ ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వార జిల్లాలోని 3 వేల 516 చెరువులు మరియు 3 వేల 267 చెక్ డ్యాములు నింపడం జరిగినది. మిషన్ కాకతీయ (చిన్న నీటి వనరుల పునరుద్దణ) ద్వారా జిల్లాలోని 2 వేల 132 చెరువుల పనులు లక్ష్యం కాగా 1 వేయి 962 చెరువుల పనులు పూర్తి అయినవి. నాబార్డు మరియు స్టేట్ ప్లాన్ సహకారముతో 19 చెక్ డ్యాముల నిర్మాణ పనులకు 84 కోట్ల రూపాయల మంజూరు కాగా పనులు పురోగతిలో కలవు.
8.23 టి.యం.సి ల సామర్థ్యముతో గౌరవెల్లి జలాశయ పనులు 85 % పూర్తి అయినవి. ఇందిరమ్మ ఫ్లడ్ ప్లో కెనాల్ ప్రాజెక్టులో భాగముగా మధ్య మానేరు జలాశయము నుండి తోటపల్లి చెరువు వరకు 91% పనులు పూర్తి అయినవి. మరియు తోటపల్లి చెరువు నుండి గౌరవెల్లి ఎత్తి పోతలలో 1 లక్ష ఎకరాలు లక్ష్యంతో 90% పనులు పూర్తి అయినవి.

7. మిషన్ భగీరథ:

ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగానే ప్రభుత్వం ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందించాలని సదాశయంతో ప్రభుత్వం మిషన్ భగీరధ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 752 ఆవాసాలకు 1 వేయి 600 కోట్ల రూపాయల అంచనాలతో పనులు చేపట్టబడినవి. జిల్లాలో ఇప్పటి వరకు 643 OHSR ట్యాంకుల నిర్మాణం మరియు 2 వేల 268 కిలోమీటర్ల పైపులైన్లు పూర్తి చేయనైనది మరియు 2 లక్షల 3 వేల 370 గృహములకు నల్లా కనెక్షన్లు పూర్తి చేసి ప్రతి రోజు త్రాగు నీరు సరఫరా చేయడం జరుగుచున్నది

8. వైద్య మరియు ఆరోగ్య శాఖ:

జిల్లాలో 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 194 ఆరోగ్య ఉప కేంద్రాలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1 బస్తీ దవాఖాన, 1 జనరల్ ఆసుపత్రి, 1 జిల్లా ఆసుపత్రి, ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడబడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో C.C టీవీలు ఏర్పాటు చేసి పై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరుపడం జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే గర్బిణీ స్త్రీలకు కె.సి.ఆర్ కిట్టు పథకం ద్వారా ఈ జిల్లాలో ఇప్పటి వరకు 41 కోట్ల 38 లక్షల రూపాయలు వ్యయంతో 44 వేల 50 కె.సి.ఆర్. కిట్లను లబ్దిదారులకు అందజేయడం జరిగినది.
జనరల్ ఆసుపత్రి నందు రేడియాలజీ విభాగాన్ని కొత్తగా ఈ మధ్యనే ప్రారంబించడం జరిగింది. ఈ విభాగం ద్వారా X-ray, ECG, 2D Echo, Ultra Sound Scan, Memography లాంటి సేవలను అందించడం జరుగుచున్నది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 12 మందికి మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చేయడం జరిగింది. ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ప్రతి వారం నిర్వహించబడతాయి. “క్యాటరాక్ట్ ( మోతేబిందు/కంటిశుక్లాలు) కాంతి సమస్య ఉన్నోళ్ళు ఉండొద్దు” అనే ఆశయం మేరకు జిల్లాలొ 72 క్యాటరాక్ట్ కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగినది.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగిన 9 వేల కాన్పులలో సాదారణ కాన్పులు 3 వేల 789 (42%) సిజిరియన్ కాన్పులు 5 వేల 220 (58%) జరిగినవి. సాధారణ కాన్పులను పెంచే ఉద్దేశముతో మిడ్ వైఫరీ కార్యక్రమం చేపట్టబడుతున్నది.
సిద్దిపేట లో 13 పడకలు, గజ్వేల్ లో 08 పడకలు కేటాయించి మూత్రపిండ వ్యాధి (kidney problems) గ్రస్తులకు డయాలసిస్ ప్రక్రియ ద్వారా సేవలు అందించబడుతున్నాయి. త్వరలో దుబ్బాక, హుస్నాబాద్ లలో 05 పడకల చొప్పున డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుచున్నది.

కార్డియాలజీలో అత్యంత సవాలుగా ఉండే క్లినికల్ పరిస్థితి అగు STEMI సంభవించిన సంధర్భంలో 30 నుంచి 40 వేల రూపాయల విలువ గల ఇంజెక్షన్ ను గజ్వేల్ మరియు సిద్దిపేట ఆసుపత్రులలో 141 కేసులకు చికిత్స అందించి 1 కోటి రూపాయల ప్రజల డబ్బును ఆధా చేయడం జరిగినది.

దక్షిణ భారత దేశములో తొలిసారిగా “ఋతుప్రేమ” కార్యక్రమాన్ని మన సిద్దిపేట లో శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళలు, బాలికల వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడే విధానమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. జిల్లాలోని మహిళా అధికారులు, ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, మహిళా వార్డు నెంబరు నుండి జడ్పిటిసి, కౌన్సిలర్ల వరకు గల ప్రజా ప్రతినిధులకు సమావేశం ఏర్పాటు చేసి మహిళల ఆరోగ్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించే శానిటరీ కప్పుల వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది. జిల్లాలోని 4 వేల ఋతుప్రేమ కప్పులను అందచేయడం జరిగినది.

9. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు:

పేదలకు గౌరవ ప్రదమైన సౌకర్య వంతమైన నివాసము ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పథకం క్రింద జిల్లాకు 15 వేల 929 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 12 వేల 216 ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా అందులో 9 వేల 253 గృహ నిర్మాణాలు పూర్తి చేసుకొని మొత్తం 4 వేల 613 ఇండ్లలో లబ్ది దారులు గృహ ప్రవేశం చేయడం జరిగినది. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 609 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

10. పల్లె ప్రగతి:

గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతో రూపకల్పన చేసిన నూతన పంచాయితీ రాజ్ చట్టం 2018 ప్రకారం దేశంలోనే మొట్టమొదటి సారిగా “ సమగ్ర పల్లె ప్రగతి” కి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లి విరియాలని, ప్రణాళిక పద్దతిలో గ్రామాల అభివృద్ధి, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరగాలని, నాల్గవ విడత 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం గత సంవత్సరము జూలై మాసంలో నిర్వహించబడింది.

పల్లె ప్రగతి కార్యక్రమంలో 15 వేల 323 ఇళ్ళ శిధిలాలు, 26 వేల 681 స్థలాల్లో సర్కారు తుమ్మ, పిచ్చి మొక్కలు, 14 వేల 577 ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. 2 వేల 317 ప్రమాదకర బావులను, 786 ఉపయోగంలో లేని బోరు బావులను, 7 వేల 405 నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను, 11 వేల 725 రోడ్లపై గల గుంతలను పూడ్చడం జరిగింది. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించుటకు, నాటిన మొక్కలను సంరక్షించుటకు 499 గ్రామపంచాయతీలలో ప్రతీ గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకరు మరియు డోజరు కొనుగోలు చేసి పారిశుధ్యం, పచ్చదనం పనులు ప్రారంభించడం జరిగింది.

సిద్ధిపేట జిల్లాలోని 489 గ్రామపంచాయితీలలో నర్సరీలను ఏర్పాటు చేసి 62 లక్షల మొక్కల పెంపకం చేపట్టడము జరుగుతున్నది. జిల్లాలోని 528 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు మరియు మండలానికి 5 చొప్పున ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనములు ఏర్పాటు చేయడం జరుగుచున్నది.

జిల్లాలోని 489 గ్రామపంచాయితీలలో వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టబడి అందులో 489 వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయబడినవి మరియు 489 గ్రామపంచాయితీలలో డంపింగ్ షెడ్ ల నిర్మాణాలు పూర్తి కాబడి వినియోగించబడుచున్నవి. పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం, జిల్లాలోని గ్రామపంచాయితీలకు ప్రతి నెలకు 7 కోట్ల 91 లక్షల రూపాయలు విడుదల చేయబడుచున్నవి.

11. పురపాలక సంఘాలు:

పట్టణ ప్రగతి పురస్కారాలలో 2021-22 సంవత్సరమునకు ఉత్తమ పారిశుద్ద్య సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట పురపాలక సంఘం ప్రథమ బహుమతి అందుకుంది. సిద్ధిపేట మునిసిపాలిటిలో భూగర్భ మురుగు నీటి పారుదల (యు.జి.డి) పథకం 302 కోట్ల రూపాయలతో రెండు ఎస్.టి.పి. ప్లాంట్స్ మరియు 328 కి.మీ. మురుగు నీటి పైపులైన్ పనులకు గాను 324 కి.మీ.ల మేరకు పనులు పూర్తి కాబడినవి. పట్టణములో బుస్సాపూర్ వద్ద తడి చెత్తను అధునాతన పద్దతిలో బయో సి.యన్.జి. గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ 10 టిపిడి సామర్థ్యముతో, గార్డెన్ వ్యర్థ పదార్థాలతో 15 టిపిడి సేంద్రీయ ఎరువు తయారు చేయుటకు కావాల్సిన మౌళిక సదుపాయాలు 6 కోట్ల రూపాయల వ్యయతో పిపిపి మోడ్ లో పని పూర్తి కాబడి వ్యర్థాలతో రోజుకు 270 కిలోల బయో గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. పట్టణములో క్రీడలను ప్రోత్సహించుటకు గాను 2 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్ బాల్ స్టేడియం 1 కోటి 80 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తికాబడి ప్రారంభానికి సిద్దంగా ఉంది.
హరితహారములో భాగంగా నేటి వరకు 14 లక్షల 84 వేల మొక్కలు నాటడం జరిగింది మరియు అట్టి మొక్కలు 95.20% శాతం వరకు బ్రతికించుకోవడం జరిగింది.

స్వచ్చ సర్వేక్షణ్-2021 లో భాగంగా దక్షిణ భారత దేశంలో బెస్ట్ సస్టెయినబుల్ సిటిగా మొదటి స్థానం సిద్దిపేట పురపాలక సంఘం కైవసం చేసుకోవడం జరిగింది. స్వచ్చ సర్వేక్షణ్ 2022 పోటీలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో సిద్దిపేట జాతీయ స్థాయిలో మొదటి స్థానం లో నిలిచింది. గజ్వేల్ మునిసిపాలిటిలో 99 కోట్ల రూపాయలతో మంజురైన భూగర్భ మురుగు నీటి పారుదల (యు.జి.డి) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చినవి మరియు TUFIDC నిధుల ద్వారా చేర్యాల మునిసిపాలిటిలో 15 కోట్ల రూపాయలతో, దుబ్బాకలో 20 కోట్ల రూపాయలతో మరియు హుస్నాబాద్ లో 12 కోట్ల రూపాయలతో మంజురైన వివిధ రకాల పనులు పురోగతిలో కలవు.

12. ఆసరా పెన్షన్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబడిన “ఆసరా పింఛను పథకం” ద్వారా జిల్లాలోని నిరుపేదలైన వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు మొత్తం అందరికీ కలిపి 1 లక్ష 68 వేల 888 పింఛనుదారులకు ప్రతి నెల 37 కోట్ల 22 లక్షల రూపాయలు అందచేస్తున్నాము.

13. హరిత హారం:

“తెలంగాణకు హరిత హారం” కార్యక్రమం ద్వారా జిల్లాలో 2021-22 సంవత్సరములో 40 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా 42 లక్షల మొక్కలు నాటడం జరిగింది మరియు 2022-23 సంవత్సరంలో 40 లక్షల మొక్కలు నాటుట లక్షంగా రూపొందించడం జరిగింది. అటవీ శాఖ ద్వారా 2021-22 సంవత్సరములో 35 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్, 23.5 కిలోమీటర్లలో వెదురు ప్లాంటేషన్ మరియు 45.4 కిలో మీటర్లలో గచ్చకాయ మొక్కలు నాటడం వంటి పనులు పూర్తి చేయడం జరిగింది.

14. అటవీ శాఖ:

సిద్దిపేట జిల్లా కొత్త కలెక్టరేట్ వద్ద 138 హెక్టార్లలో తేజోవనము, గజ్వెల్ పట్టణము దగ్గర సంగాపూర్ వద్ద 117 హెక్టార్లలో కల్పకవనములను అభివృద్ది చేయడము జరుగుతున్నది. చింతమడక రిజర్వ్ ఫారెస్ట్ ను అర్బన్ పార్కు గా అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు రూపొందించి, ఇనుప కంచె, ప్రహారి గోడ, మొదలగు పనులు జరుగుతున్నవి.
తేజోవనము మరియు కల్పకవనము నగర పర్యావరణ ఉద్యానవనములు అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడము జరుగుతున్నది. 2022-23 సంవత్సరము కొరకు అటవీ శాఖ ద్వారా 40 లక్షల మొక్కలు నర్సరీలలో పెంచుటకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది.
జిల్లాలోని సహజ అడవులలో 13 వేల ఎకరాలలో రిజువినెషన్ పనులు చేపట్టి అడవుల పునర్జీవనంచేయడం జరిగింది. అంతేకాక దాదాపు 8500 ఎకరాలలో మొక్కలు నాటి జిల్లాలోని అడవులన్నింటిని నాణ్యంగా మార్చి దేశములోనే సిద్దిపేట జిల్లా ఒక ఉదాహరణగా నిలిచింది.

15. రోడ్లు మరియు భవనాల శాఖ:

జిల్లాలో 172 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిద్దిపేట నుండి కిష్టాపూర్ వరకు గల 22 కి.మీ.లు రెండు వరుసల నుండి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో కలవు మరియు 160 కోట్ల రూపాయలతో సిద్దిపేట నుండి చుట్టూ 74 కి.మీ.ల రెండు వరుసల “సిద్దిపేట రింగ్ రోడ్డు” నిర్మాణపనులు జరుగుతున్నాయి, 298 కోట్ల రూపాయలతో 22 కి.మీ.ల గజ్వేల్ రింగ్ రోడ్డు మరియు రేడియల్ రహదారి పనులు 4 వరుసలు అభివృద్ది చేయు పనులు జరుగుతున్నవి.
దుబ్బాకలో నూతన బస్టాండ్ నిర్మాణము 3 కోట్ల రూపాయలతో మంజూరు కాగా పనులు పురోగతిలో కలవు మరియు సిద్దిపేటలో 50 కోట్ల రూపాయలతో ఆడిటోరియమ్ మరియు 25 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నవి.
మెదక్ – సిద్ధిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి మరియు జనగాం – దుద్దేడ జాతీయ రహదారుల విస్తరణ పనులు పురోగతిలో కలవు.

16. విద్యుత్ శాఖ:

దేశంలో అనేక రాష్త్రాలు విద్యుత్ కొరతలతో సతమతమవుతుండగా మన తెలంగాణా రాష్ట్రంలో 24 గంటలు నిరంతరాయంగా ఎలాంటి ఆటంకం లేకుండా గృహ అవసరాలకు మరియు పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా చేయబడుతున్నది. దేశం మొత్తంలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా.

17. కళ్యాణ లక్ష్మి – షాదీముబారక్:

కల్యాణ లక్ష్మి మరియు షాధిముబారక్ పథకముల ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం 1 లక్ష 116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. జిల్లాలో 2021-22 సంవత్సరంలో కల్యాణ లక్ష్మి పథకము ద్వారా 7 వేల 585 మందికి 75 కోట్ల 93 వేల 79 లక్షల 860 రూపాయలు మరియు షాధిముబారక్ పథకము ద్వారా 346 మందికి 3 కోట్ల 46 లక్షల 40 వేల 136 రూపాయలు అందించడం జరిగింది.

18. ధరణి:

తెలంగాణ ప్రభుత్వం రాష్టం లోని రైతాంగమునకు సత్వర సేవలను అందుంచుటకై “ధరణి” పోర్టల్ ను ప్రారంభించి, రైతులకు సంబంధించిన వివరాలను అందరికీ పోర్టల్ లో అందుబాటులో ఉండేలా రూపొంధించింది. వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్ళే అవసరం లేకుండా తహశీల్దార్ లకు అధికారం బదలాయించింది. రిజిస్ట్రేషన్ తో పాటు వెంటనే పట్టాదారు పాసు పుస్తకములు ఇవ్వడం జరుగుతుంది. లావాదేవీలు జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంబంధిత భూ మార్పిడి ఉత్తర్వుల పత్రములు భూ యజమానికి అందచేయబడును మరియు ఇ-పట్టాదార్ పాస్ బుక్ ను భూ యజమానులకు వెంటనే అండిచడం దీని ప్రత్యేకత.
ధరణిలో సిద్దిపేట జిల్లాలో నేటి వరకు 6 వేల 562 రిజిస్ట్రేషన్లు మరియు 310 పెండింగ్ మ్యూటేషన్స్ పూర్తి చేయబడినవి.

19. శాంతి భధ్రతలు:

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలీసు శాఖను పటిష్టం చేసినది. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని సమకూర్చింది. అధునాతన వాహనములను అందజేసింది. పోలీసులు ప్రజలతో మమేకము అయ్యేలా “ఫ్రెండ్లీ పోలీసు” విధానాన్ని అమలు జెయించి, ప్రతి గ్రామానికి పోలీసు అధికారిని నియమించి చిన్న చిన్న సమస్యలను గుర్తించి ప్రజల సహకారముతో గ్రామాలలోనే పరిష్కరిస్తున్నారు.

నిరుద్యోగులైన యువతి, యువకులకు యస్.ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగులు సాదించుటకు గాను 1 వేయి 162 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. దీనితో పాటు శారీరక ధృడత్వ శిక్షణ ఇవ్వడము జరుగుచున్నది. జిల్లాలో మహిళల మరియు బాలల సహాయ భరోసా కేంద్రము నూతన భవనము నిర్మాణము శంకుస్థాపన చేయడము జరిగినది, పనులు పురోగతిలో కలవు. పోలీసు శాఖ పనితీరుతో శాంతి భధ్రతలు నెలకొనడం వల్ల ప్రజా జీవనము ప్రశాంతముగా కొనసాగుతున్నది.

జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ లబ్దిదారులకు ప్రయోజనం కల్గిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకెళ్ళి నిరంతరం కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రభుత్వ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ వాటి ఫలాలను ప్రజలకు చేరేలా నిరంతరం శ్రమిస్తూ మన సిద్ధిపేట జిల్లాను వివిధ రంగాలలో రాష్ట్రములోనే అగ్రగామిగా నిలుపుతున్న మన జిల్లా యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతి భద్రతలు పరిరక్షించటం, నేరాలను అదుపు చేయటంలో ఆధునిక సాంకేతిక సమాచారాన్ని సమర్ధవంతంగా వినియోగిస్తూ నిరంతరం కృషిచేస్తున్న పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. బంగారు తెలంగాణ, మన ప్రజలందరి సర్వతో ముఖాభివృద్ధి సాధనలో అందరూ భాగస్వాములై తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి చేయూతనిచ్చి ప్రతి ప్రభుత్వ కార్యక్రమం లబ్దిదారులకు వందకు వంద శాతం లబ్ది చేర్చేలా కృషి చేద్దామని, కంకణ బద్దులు కావాలని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికి మరో సారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News