Sunday, January 19, 2025

కంటి సమస్య ఉంటే… వెంటనే చికిత్స తీసుకోవాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao statement on Eye problems

సిద్ధిపేట: ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దని, చికిత్స లేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కావొద్దన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ వార్డులో కంటి సమస్యలతో బాధపడే ప్రజలను గుర్తించి వారికి అవసరమైన కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తే, ప్రతీ ఒక్కరికీ 18 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలు వరకూ ఆదా చేసినవారమవుతామన్నారు. ప్రజలకు వైద్య సేవతో పాటు, మేలు చేకూర్చిన వారమవుతామని, ఆ దిశగా వార్డుల్లో కంటి సమస్యతో బాధపడే ప్రజలకు ప్రత్యేక కంటి క్యాంపు పెట్టి వారిని గుర్తించి కంటి వైద్య సేవలు లభించేలా కృషి చేయాలని ప్రజా ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.

పట్టణంలో కంటి క్యాటారాక్ట్, మోకాలి చిప్ప ఆపరేషన్లు అంశాలతో పాటు పట్టణ ప్రగతి, వర్షాకాల దృష్ట్యా హరితహారం చెట్లు పెంపకం సన్నాహాలు, స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికార యంత్రాంగం, వార్డు నోడల్ అధికారులు, డిఎంహెచ్ఒ డాక్టర్ కాశీనాథ్, పట్టణ ముఖ్య నాయకులు, వార్డు స్థాయి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో మంగళవారం ఉదయం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

సిద్ధిపేట పట్టణాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్నామని, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కౌన్సిలర్లకు మంత్రి సూచించారు. పట్టణంలోని వార్డులు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తించి, పరిష్కరించే దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, వార్డు స్థాయి పార్టీ శ్రేణులు చొరవ చూపి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రానున్న వర్షాకాల దృష్ట్యా పట్టణంలో వరద నీటి సమస్య, పారిశుద్ధ్యం, సీజనల్‌ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు.

పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి వర్షాకాల సీజన్‌ దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన ప్రతీ మున్సిపల్ వార్డు వారీగా కార్యాచరణ రూపొందించి, పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేపట్టాలని, కౌన్సిలర్లు, వార్డు పార్టీ అధ్యక్షులకు మంత్రి సూచించారు.

అలాగే చాలా మందిని వేధిస్తున్న సమస్య మోకాళ్ల నొప్పులు, వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు అధికమవుతున్నాయని, ఎన్ని మందులు వాడినా ప్రభావం అప్పటి వరకే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనం కలగడంలేదని, అందుకనే మోకాలి చిప్ప మార్పిడిని ఎంచుకుంటున్న దరిమిలా, సామాన్యులకు ఇది ఒక వరం అని తెలిసేలా వార్డుల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పారు. ఖర్చుతో కూడుకున్న చికిత్సను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నట్లు తెలపాలని, వార్డుల వారీగా అవసరమైన ప్రజలను గుర్తించి మరింత మందికి మోకాలి చిప్ప ఆపరేషన్లు చేయించాలని కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో సిద్ధిపేట పట్టణం మెరుగైన ర్యాంకు సాధించే విధంగా అన్ని విభాగాలు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రోజువారీగా ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్త, హానికర వ్యర్ధాలు వేరు వేరుగా సేకరించడం, పట్టణంలోని అన్నీ వార్డులు పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ సీరియస్ గా ఉండాలని సూచించారు. కాన్ఫరెన్స్ లో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, అన్నీ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మున్సిపల్ వార్డు నోడల్ అధికారులు, ఇతర పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News