Monday, December 23, 2024

ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నెల వారీ (హెల్త్ క్యాలెండర్) సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల ప‌నితీరు, పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సూప‌ర్‌వైజ‌రీ సిబ్బందితో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఎన్సిడి స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి-సెక్షన్ల రేటు, ఏఎన్ సి రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి-డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపి, తదితర వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్సిల వారీగా సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ”ప్రాథమిక దశలో రోగాలు గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగంగా మారకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. ఇందులో పి హెచ్ సిలది కీలక పాత్ర. క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు తెల్సుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతి నెల అన్ని పి హెచ్ సీ లు తప్పని సరిగా సందర్శించాలి. నెలలో ఒక రోజు రాత్రి 24×7 పిహెచ్ సీలో నిద్ర చేయాలి.

ఒక రోజు నేను నిద్ర చేస్తాను. అక్కడి పరిస్థితులు తెల్సుకుంటాను. ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి సహకారంతో మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇంకా చాలా మార్పు రావాలి. తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం.. IMR – శిశు మరణాల రేటు 23నుండి 21కి తగ్గింది. 2014లో ఇది 39 ఉండేది. దేశంలో ప్రస్తుతం 28గా ఉంది. దవాఖానల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, అరోగ్య లక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వంటివి తగ్గుదలకు దోహదం చేశాయి. కరోనా కేసులు దేశంలో కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. మనం అప్రమత్తంగా ఉందాం. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి. అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తి చేయాలి. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా.. స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని, ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి. వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సీఎం ఆలోచన మేరకు పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి” అని పేర్కొన్నారు.

Harish Rao Teleconference with Health Dept Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News