Wednesday, January 22, 2025

ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానం చేరాలి

- Advertisement -
- Advertisement -

ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానం చేరాలి
 వైద్యశాఖకు బడ్జెట్ డబుల్ చేసుకున్నాం
 పోటీ పడి, నూతనోత్సాహంతో పని చేయాలి
 ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరగాలి
 సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలి
 ప్రైవేటులో సి- సెక్షన్లపై పరిశీలన చేయాలి
 ఇక నుంచి నెలవారీగా సమీక్ష ఉంటుంది
 అందరూ రిపోర్టులతో సిద్ధంగా ఉండాలి
 మంచి పనితీరు కనబర్చితే ప్రత్యేక గుర్తింపు
 విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు
మలేరియా రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి
ఈ నెల 7న వరల్ హెల్త్ డే సందర్భంగా ’ఉత్తమ’ సిబ్బందికి సన్మానం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
వైద్యారోగ్య సిబ్బంది, అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచించారు. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని, రూ.11,237 కోట్లతో గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలని తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలు, ఏఎన్‌ఎంలు, పిహెచ్‌సి వైద్యులు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, డిఎంహెచ్‌ఒలతో మంత్రి హరీశ్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీహెచ్ శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్ సెంటర్, పిహెచ్‌సిల వారీగా పురోగతిని సమీక్షించారు. ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎఎన్‌సి చెకప్స్, డెలివరీలు, ఎన్‌సిడి ప్రోగ్రాం, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరే ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలన్నారు. అందరం కలిసి పని చేయడం వల్ల ఎంఎంఆర్ సూచీలో తమిళనాడును అధిగమించి దేశంలో రెండో స్థానానికి చేరుకున్నామని చెప్పారు. ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యమని, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు.
మంచి పనితీరు కనబర్చిన వారికి సన్మానం
మంచి పనితీరు కనబర్చిన డిఎంహెచ్‌ఒలు, పిహెచ్‌సి వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఈనెల 7న వరల్ హెల్త్ డే పురస్కరించుకొని నగదు ప్రోత్సాహంతో పాటు సన్మానం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రతి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి సన్మానిస్తామని చెప్పారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. అదే సమయంలో పని చేయని వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఏఎన్‌సీ చెకప్స్ సక్రమంగా నిర్వహించాలని, గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే సెక్షన్లపై గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం పట్ల పరిశీలన చేయాలని, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, డిఎంహెచ్‌ఒలను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెలా అన్ని పారామీటర్ల మీద సమీక్ష ఉంటుందని, ప్రతి ఒక్కరు రిపోర్టులతో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణలు వారానికి ఒక జిల్లాకు వస్తారని, సర్‌ప్రైజ్ విజిట్స్ చేస్తారని తెలిపారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని, ఇదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆశా కార్యకర్తల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు సార్లు పెంచి, ప్రస్తుతం రూ.9,750 పారితోషకాన్ని ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అందరం కలిసి శ్రమించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఎన్‌హెచ్‌ఎంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టిఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఒఎస్‌డి గంగాధర్, స్టేట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ సుధీర, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాల అధికారులు పాల్గొన్నారు. మెటర్నల్ హెల్త్, చైల్ హెల్త్, మిడ్ వైఫరీ, నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ ప్రొగ్రాం, బస్తీ దవాఖానలు, 108, కేసీఆర్ కిట్లు, టి- డయాగ్నోస్టిక్స్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, టీబీ, సాంక్రమిక, ఆసాంక్రమిక వ్యాధులు తదితర విభాగాల పురోగతిని పరిశీలించారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్నజిల్లాలు పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, ప్రతి నెల విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదని, మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల సీజనల్ వ్యాధులు చాలా తగ్గాయని, మలేరియా విభాగంలో రాష్ట్రం కేటగిరీ 2 నుంచి 1కి చేరిందని, దీన్ని కేటగిరి సున్నాకు చేరుకునేలా చేసి, మలేరియా రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నారు. జిల్లాల్లోని వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Harish Rao Teleconference with Health Officer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News