Thursday, January 23, 2025

త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు

- Advertisement -
- Advertisement -

త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు
సిఎంలు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితిమైన ఎయిర్స్ అంబులెన్స్‌లు పేదలకు అందుబాటులోకి తీసుకువస్తాం
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం
పేదల పట్ల సిఎం కెసిఆర్‌కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాం
60 ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే వైద్యారోగ్య శాఖ ఆవిష్కరించింది
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు
కొత్తగా ఉద్యోగాలు పొందిన 310 ఫార్మసిస్టులకు ఉద్యోగ నియమక పత్రాలు, పోస్టింగ్ ఆర్డర్లు అందజేసిన మంత్రి
ప్రభుత్వ ఉద్యోగం అనేది పేదలకు సేవ చేసేందుకు లభించిన గొప్ప అవకాశం
ఫార్మసిస్టులు పేద రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారు : హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదలకు అత్యవసర సమయంలో సకాలంలో వైద్య సేవలు అందించేందుకు త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా వారిని హైదరాబాద్‌కు తరలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని తెలిపారు. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేదల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 119 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉంటే ఇప్పుడు అవి 82కు చేరాయని అన్నారు. డయాలసిస్ చేయించుకునే బాధితులకు ఉచిత బస్‌పాస్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.

పేదల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను సోమవారం రవీంద్రభారతిలో మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఐడిసి ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి,ఆరోగ్య శ్రీ ట్రస్టు చైర్మన్ డాక్టర్ సుధాకర్, డిఎంఇ రమేశ్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత పలువురు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫార్మసిస్టు ఉద్యోగాలు పొందిన 310 మంది అభ్యర్థులకు మంత్రి ఉద్యోగ నియమక పత్రాలు, పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్య ఆరోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మంది ఫార్మసిస్టులకు స్వాగతం తెలిపారు. వరల్ ఫార్మసిస్ట్ డే రోజున కొత్తగా విధుల్లోకి చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105, టివివిపి పరిధిలోని 135, డిఎంఇ పరిధిలోని 70 పోస్టులు… మొత్తం 310 మంది ఫార్మసిస్టులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో సేవలు బాగుండాలంటే అందరికీ తగినన్ని మందులు ఉండాలని అన్నారు. రోగులకు మందులు సమకూర్చి, వారికి అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది పేదలకు సేవ చేసేందుకు లభించిన గొప్ప అవకాశమని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ ఉద్యోగాలతో ఉపాధి దొరికితే.. ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. కొత్త ఉద్యోగ ఉద్యోగాలు పొందిన ఫార్మసిస్టులు పేద రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారని తెలిపారు.ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదని, త్వరలో రెండో స్థానంలోకి చేరబోతుందని చెప్పారు.ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రైవేటులో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి పోయిందని చెప్పారు. కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మొదటి స్థానానికి చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

10 ఏండ్లలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలోనే 22,600 పోస్టులు భర్తీ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇందులో 5,204 స్టాఫ్ నర్స్ పరీక్ష పూర్తయ్యిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1,931 ఎంపిహెచ్‌ఎ(ఫిమేల్) పోస్టులు ఉన్నాయని,ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయితే వైద్యారోగ్య శాఖలో పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని మంత్రి తెలిపారు.

ఆరోగ్య సూచీలో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సూచికలో 11వ స్థానం నుంచి తెలంగాణ 3వ స్థానానికి చేరటం గర్వ కారణమని పేర్కొన్నారు.మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నామని అన్నారు.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, తాము పనిచేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల ముందు తమ ప్రగతి నివేదికను పెడుతున్నామని చెప్పారు. వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంలో తమ ప్రభుత్వ పనితీరుకు, వైద్యారోగ్య శాఖ పని తీరుకు ప్రగతి నివేదిక నిదర్శనమని పేర్కొన్నారు. పదేళ్ల ప్రయాణాల్లో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. 60 ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే వైద్యారోగ్య శాఖ ఆవిష్కరించిందని, దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే…ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 76 శాతానికి పెరిగిందన్నారు. ఆశలు, ఎఎన్‌ఎంల నుంచి మంత్రి వరకు అందరి సమిష్టి కృషివల్లనే ఇది సాధ్యమైంది అని హరీశ్‌రావు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించడంలో, ప్రజల ప్రాణాలు కాపాడటంలో నిత్యం నిమగ్నమై కృషి చేస్తున్న వైద్యారోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

వైద్యారోగ్య శాఖకు రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం..
ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు సిఎం కెసిఆర్ పాలనలో పోదాం బిడ్డో సర్కారు దవాఖానకే అనేలా మార్పు వచ్చిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.ఇది మంత్రం ఏస్తేనో, మాయ చేస్తేనో జరిగిన అద్భుతం కాదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిఎం కెసిఆర్ వైద్యారోగ్య శాఖకు రూ.12,364 కోట్ల బడ్జెట్ కేటాయించారని, అందువల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయయని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై వైద్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532 అని, ఇందులో దేశంలో మూడో స్థానంలో ఉన్నామని అన్నారు. తెలంగాణ వైద్యారోగ్య రంగం ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వ సన్నద్ధంగా రూపొందిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో 17 వేల పడకలు ఉంటే, వాటిని 34 వేలకు పెంచామని, త్వరలో 50 వేల పడకలు అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పారు. ఆక్సిజన్ పడకలు గతంలో 1400 ఉంటే ఇప్పుడు అవి 30 రెట్లు పెరుగుదలతో 34 వేలకు చేరాయని తెలిపారు.

రాష్ట్రంలో 20 ఉన్న మెడికల్ కళాశాలల సంఖ్య 56కు చేరిందని, కేవలం ఐదు ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు 26కు చేరాయని పేర్కొన్నార.2,850 ఉన్న ఎంబిబిఎస్ సీట్లు 8,515కు పెరిగాయని, 1,183 ఉన్న పిజి మెడికల్ సీట్లు, 2,890కు పెరిగాయని వివరించారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలు 5 మాత్రమే ఉంటే, ఇప్పడు ఐసియుల సంఖ్య 80కి చేరిందని అన్నారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలు గణనీయంగా తగ్గాయని మంత్రి తెలిపారు. 316 ఉన్న 108 అంబులెన్స్‌ల సంఖ్యను 450కి పెంచామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలు, 50 పదమపద వాహనాలు 33 నియో నాటల్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్యారోగ్య శాఖకు బడ్జెట్ పెరగడం వల్ల ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, డయాలసిస్ కేంద్రాల వంటి అన్ని రకాల సౌకర్యాలను పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

అవయవమార్పిడిలో దేశంలోనే నెంబర్‌వన్
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం చెప్పిందని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేసి నిమ్స్ హాస్పిటల్ రికార్డ్ సృష్టించిందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారని అన్నారు. త్వరలో గాంధీ ఆస్పత్రి 8వ అంతస్తులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని పేర్కొన్నారు. ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్‌లో ప్రతినెలా సగటున ఎనిమిది మందికి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ మార్పిడులు చేసుకునేలా మారబోతున్నాయని అన్నారు.

నిమ్స్‌లో ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు..
నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నుంచి వారం రోజులపాటు బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అరున్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉన్నంతకాలం వైద్య ఆరోగ్య శాఖను మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. పిహెచ్‌సి స్థాయి నుంచి అన్ని స్థాయి దవాఖానాల్లో ప్రగతి నివేదికను ప్రదర్శించాలని అధికారులకు సూచించామని మంత్రి తెలిపారు. తమ రిపోర్టును చూసే ప్రజలంతా ఆశీర్వదించాలని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News