సిద్ధిపేట: ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని మంత్రి అన్నారు. శనివారం జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువ చేయాలనే లక్ష్యంగా సిఎం కెసిఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని, ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఏఏన్ఏఎంలు, వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కావాల్సిన అన్నీ వసతులు ఉన్నాయని, ప్రజలకు మంచి వైద్య సేవలు చేద్దామని వైద్య అధికారులు, సిబ్బందిని కోరారు. సిఎం కెసిఆర్ ప్రజల వైద్యం కోసం అన్నీ సమకూర్చి అందుబాటులో పెట్టారని, ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని, ఎక్కడ అలసత్వం, నిర్లక్ష్యం ఉండొద్దని వైద్య అధికారులు, సిబ్బందిని సుతిమెత్తగా హెచ్చరించారు. 24/7 నిరంతరం వైద్య సేవలు అందించాలని, ప్రతీ వైద్యాధికారి, సిబ్బంది ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన తప్పనిసరి పాటించాలని ఆదేశించారు.
అవసరమైన మందుల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ కూడా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోనే ఉందన్నారు. ప్రతీ పీహెచ్ సీలో పాము, కుక్క, తేలు కాటుకై వచ్చే రోగులకు అర్థరాత్రి వచ్చినా కావాల్సిన మందులు ఇచ్చి వారిని కాపాడుకోవాలని, ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు. జిల్లా మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రజినితో చర్చిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల విషయమై 12 వారాలలో రిజిస్ట్రేషన్లు చేయిస్తామని, విడతల వారీగా చెకప్ చేస్తామని రజిని వివరించగా.. ఎప్పుడెప్పుడు చేస్తారో.. క్షుణ్ణంగా చెప్పాలని, 66 శాతం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, మిగతా 34 శాతం ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేలా పని చేయాలని సూచించారు. ఇవాళ జిల్లా గర్భిణీల సంఖ్య ఎంత అని మంత్రి ఆరా తీశారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇచ్చే ప్రాధాన్యతపై చెప్పడం మీ విధి అంటూ తల్లి, బిడ్డ ఆరోగ్యాలు కాపాడేలా చూడాలని.. ఇక నుంచి డైలీ మానిటరింగ్, వీక్లీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని.. మీ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
Harish Rao visit Chinakoduru Health Centre