Wednesday, January 29, 2025

కిమ్స్‌లో శ్రీతేజను పరామర్శించిన హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సిఎం,మంత్రులు స్పందించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు అన్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను సిఎం రేవంత్ రెడ్డి,ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని అడిగారు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సిఎం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను గురువారం బిఆర్‌ఎస్ నేతలు కెపి వివేకానంద, బండారు లకా్ష్మరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నవీన్‌రావులతో కలిసి హరీష్ రావు పరామర్శించి శ్రీతేజ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను కెసిఆర్ సూచనతో బిఆర్‌ఎస్ నేతలం పరామర్శించామని చెప్పారు. శ్రీతేజ కోలుకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. శ్రీతేజకు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారని అన్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్క ర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్‌కు మంచి వైద్యాన్ని అందిస్తోందని చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి హరీష్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామని, రేవతి అందరి మనసును కరిగేలా చేశారని అన్నారు. ప్రతిపక్షాలపై సిఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నారని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సిఎం రేవంత్ కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా..? అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు అని సూచించారు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలని వ్యాఖ్యానించారు.

మందా జగన్నాథంను పరామర్శించిన హరీష్‌రావు
నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జగన్నాథంను కలిసిన బిఆర్‌ఎస్ నేతలు లక్ష్మీ రెడ్డి, వివేకానంద గౌడ్, దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్ది ఉన్నారు. అలాగే గచ్చిబౌలి ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి తండ్రి పాడి సాయినాథ్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News