హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? అని నిలదీశారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే తన, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ సమాజమే రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందన్నారు.
- Advertisement -