Tuesday, December 24, 2024

కెసిఆర్ చలవేతోనే రేవంత్‌కు సిఎం అనే ఉద్యోగం వచ్చింది:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు, పాలనతో తెలంగాణ సురక్షితంగా ఉన్నందునే నువ్వు ముఖ్యమంత్రివి కాగలిగావని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. నీలాంటి వాడి చేతికి పొరపాటున 2014లో అధికారం ఇస్తే తెలంగాణ వాడిని అమ్మేసే వాడివని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు బుధవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్‌ఎస్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది బీఆర్‌ఎస్, పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్‌ఎస్ అని అన్నారు. సమాజాన్ని తీర్చి దిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సంస్కార హీనుడివని రేవంత్‌పై మండిపడ్డారు.

ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కెసిఆర్ ను తిట్టడానికి వినియోగిస్తున్నావని అన్నారు. కెసిఆర్‌ను కొరివి దయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరని చెబుతూ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివిదయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కెసిఆర్ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు బిల్లా రంగాల గురించి చెబుతావా..? అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. విద్యార్థులకు బిల్లా రంగాల గురించి భోధించమని టీచర్లకు చెబుతున్నావా ? అని నిలదీశారు. గతంలో రాహుల్ గాంధీని తీవ్రవాది అని ఓ కేంద్రమంత్రి అంటే దిష్టి బొమ్మలు కాల్చారు కదా, ఇప్పుడు మీరు సిఎం స్థానంలో ఉండి బిల్లా రంగాలతో పోల్చవచ్చా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మీ దిష్టి బొమ్మలు ఎన్ని కాల్చాలి..?, రాహుల్ గాంధీకి ఒక నీతి మాకో నీతా..? అని నిలదీశారు. ఎమ్మెల్సీగా కవిత ఓట్ల తోనే గెలిచారని హరీష్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన వారికి మీరు పదవులు ఇవ్వలేదా..? ఇదేమైనా కొత్తనా అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. నువ్విప్పుడు ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా ? అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News