సిద్ధూకు పిసిసిపై అమరీందర్ వ్యాఖ్య
చండీగఢ్: కాంగ్రెస్ అధినేత్రి తీసుకునే ఏ నిర్ణయమైనా తమకు ఆమోదయోగ్యమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీష్ రావత్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. కాగా.. అమరీందర్ సింగ్‌కు, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న దరిమిలా పంజాబ్ పిసిసిలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రావత్ హుటాహుటిన శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్‌లో మొహాలిలోని ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ సమావేశమయ్యారు.
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ సిద్ధూను నియమించనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుక్రవారం లేఖ రాసిన అమరీందర్ సింగ్ జాట్ సిక్కు అయిన సిద్ధూకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన పక్షంలో హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇది వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపగలదని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇదిలా ఉంటే, పంజాబ్ పిసిసి అధ్యక్షుడు సునీల్ జాకఢ్‌ను నవజోత్ సింగ్ సిద్ధూ శనివారం పంచ్‌కులలో కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరగంట పాటు సమావేశమైన అనంతరం సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ జాకఢ్ తనకు పెద్దన్న లాంటివారని, తనకు మార్గదర్శి అని చెప్పారు. సిద్ధూను సమర్ధుడైన వ్యక్తిగా జాకఢ్ అభివర్ణించారు.