హరీష్ సాల్వే వినతికి సుప్రీం’ ఆమోదం
న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్, మందులతోసహా నిత్యావసర సరఫరాలు, సర్వీసుల పంపిణీకి సంబంధించి తాము చేపట్టిన సుమోటో కేసులో అమికస్ క్యూరీగా తప్పుకోవడానికి అనుమతించాలన్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం ఆమోదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే తనకు స్కూలు, కాలేజ్ రోజుల నుంచి తెలుసునని, అత్యంత సున్నితమైన ఈ వ్యవహారంలో తాను అమికస్ క్యూరీగా కొనసాగలేనని హరీష్ సాల్వే కోర్టుకు తెలియచేశారు.
కాగా, గురువారం తాము జారీచేసిన ఉత్తర్వులను చదవకుండా కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన ప్రకటనలపై చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కొవిడ్-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివిధ హైకోర్టులలో దాఖలైన కేసుల విచారణ నిలుపుదలకు తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము సుమోటోగా చేపట్టిన కేసుపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.