Thursday, January 23, 2025

హరితహారం అద్భుత కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు ఫలితాలు బాగున్నాయి
మహారాష్ట్రలోనూ హరితహారం తరహా కార్యక్రమం అమలు చేస్తాం
‘హరితహారం’పై మహారాష్ట్ర ఉన్నతాధికారులు బృందం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా మొదలు పెట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు రాబట్టిందని మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ( రెవెన్యూ, అటవీశాఖ) బి. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. హరితహారం ఫలితాలను అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. అరణ్య భవన్‌లో తెలంగాణ అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ బృందం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పిసిసిఎఫ్ ) ఆర్ ఎం డోబ్రియాల్ మహారాష్ట్ర అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్లుగా అమలు అవుతున్న హరితహారం ఫలితాలు, విజయాలపై వివరించారు.

తెలంగాణలో పచ్చదనం పెంపు కార్యక్రమాలు బాగున్నాయని, రాజకీయ సంకల్పానికి తోడు అధికారుల కృషి కూడా తోడై అద్భుతమైన ఫలితాలు సాధించారని అంటూ మహారాష్ట్ర అధికారులు హ్యాట్సాఫ్ అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, అటవీ అర్భన్ పార్కుల ఏర్పాటు, అన్ని రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, గ్రామ స్థాయిలో సర్సరీ ఏర్పాటుతో పాటు కచ్చితమైన ఫలితాలు సాధించేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను మార్చి మరీ కింది స్థాయి ప్రజాప్రతినిధులను, అధికారుల జవాబుదారీతనం చేయటం బాగుందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఎక్కడ హైవే వెంట ఏపుగా పెరిగిన చెట్లతో పచ్చదనం కనిపిస్తోందో అక్కడ నుంచి తెలంగాణ సరిహద్దు మొదలైనట్లు అనే మాట తామూ విన్నామని అన్నారు.

2015లో మొదలైన తెలంగాణకు హరితహారం ద్వారా గత తొమ్మిదేళ్లలో సాధించిన ఫలితాలపై పిసిసిఎఫ్ ఫోటోలు, వీడియోల సహాయంతో వివరించారు. ఇప్పటి దాకా 292 కోట్ల మొక్కలను నాటామని, 11.44 లక్షల ఎకరాల్లో అటవీ పునరుద్దరణ పూర్తి చేశామని 12 వేల కిలో మీటర్లకు పైగా రహదారుల వెంట మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామని, 12,003 ఎకరాల ఇరిగేషన్ భూముల్లో దశాబ్ధి సంపద వనాలను ఏర్పాటు చేశామని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.70 శాతం పచ్చదనం పెంపును సాధించామని డోబ్రియల్ ఆ సమావేశంలో వివరించారు. ప్రభుత్వ స్థాయిలో పట్టుదల, అన్ని శాఖల సమన్వయంతో ఈ విజయాలు సాధించామని తెలిపారు. రానున్న 2024 ఏడాదిలో కూడా 20 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటేందుకు లక్షంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రతీస్థాయిలో ప్రజా ప్రతినిధులకు తోడు చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ స్థాయిలో కార్యదర్శి వరకు హరితహారంలో భాగం అయ్యారని పిసిసిఎఫ్ తెలిపారు. అన్ని పట్టణ ప్రాంతాలకు సమీపాల్లో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన 109 అర్భన్ పారెస్టు పార్కులు రానున్న తరాలకు ఆరోగ్యాన్ని అందించే అర్బన్ లంగ్ స్పెస్‌లుగా మారాయని వివరించారు. తెలంగాణలో త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి హరితహారం విజయాలను అధ్యయనం చేసేందుకు ఒక అధికారుల బృందాన్ని పంపుతామని మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బి. వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ఉన్నతాధికారులు కూడా మహారాష్ట్రలో పర్యటించాలని ఆహ్వానించారు.

ఈ సమావేశంలో మహారాష్ట్ర అదనపు పిసిసిఎఫ్ ( ప్లానింగ్, డెవలప్‌మెంట్ ) పి.కళ్యాణ్ కుమార్, అదనపు పిసిసిఎఫ్ ( సోషల్ ఫారెస్టీ ) వివేక్ కందేఖర్ లతో ప ఆటు తెలంగాణ పిసిసిఎఫ్‌లు ఏలు సింగ్ మేరు, సువర్ణ ఎంసి పర్గేయిన్, అదనపు పిసిసిఎఫ్ సునీతా భగవత్, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, హరితనిధి ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News