కాలుష్యం తగ్గాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టినట్టు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా ఆదివారం పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్ డివిజన్‌లో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన జోగినిపల్లి సంతోష్‌కుమార్ తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి నాటారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహానగరం లాంటి ప్రదేశంలో వాహనాలు వివిధ కంపెనీల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీనిని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలను నాటి వాటిని పెంచాలన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఏ విధంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందో చూస్తున్నామని అలాంటి పరిస్థితి మన హైదరాబాద్‌కు రాకూడదని, మనందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజకుమార్ పటేల్, వెంగళ్‌రావు నగర్ కార్పొరేటర్ దేదివ్య, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.