Sunday, January 19, 2025

వినాశనం కలిగిస్తున్న రసాయనాలు

- Advertisement -
- Advertisement -

రసాయనాల వినియోగం మన జీవితంలో భాగమైంది. వ్యవసాయంలో పంటలకు తెగుళ్లు సోకితే క్రిమిసంహారక మందులను విరివిగా వాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, పాలు ,నీళ్లు అన్నిటిలోనూ రసాయన అవశేషాలు పేరుకు పోతున్నాయి. 1960 దశాబ్ది నుంచి దేశంలో హరిత విప్లవం ప్రారంభం కావడంతో వ్యవసాయ ఉత్పత్తులను అత్యధికంగా సాధించాలన్న ఆకాంక్ష రైతుల్లో పెరిగింది. దానికి తగ్గట్టు పంట తెగుళ్ల నివారణకు రసాయనాల వాడకం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు 70 వేల రకాల రసాయనాలు ఉపయోగంలో ఉన్నాయి.

అనుపమ వర్మ కమిటీ సిఫార్సుల ప్రకారం 18 రకాల క్రిమికీటక నాశనాలను ప్రభుత్వం నిషేధించింది. దేశంలో ఏటా తెగుళ్లు , పీడలు సోకి దాదాపు 45 వేల కోట్ల రూపాయల విలువైన పంటలను రైతులు నష్టపోతున్నారు. పంట తెగుళ్లను ఇవి తాత్కాలికంగా అరికట్టగలిగినా తరువాత వచ్చే తీవ్ర పరిణామాలను రైతులు గుర్తించడం లేదు.ఈ విష రసాయనాల వల్లనే ఏటా రెండు లక్షల మంది బలైపోతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రసాయన ఎరువుల్లో పాదరసం, సీసం, సిల్వర్, నికెల్, సెలీనియం , థాలియం, కాడ్మియం, యురేనియం, వంటి భారీ ఖనిజ ధాతువులు ఉంటాయని , అవే ముప్పు తెచ్చి పెడుతున్నాయని కేంద్ర ఆరోగ్యపరిశోధన విభాగం హెచ్చరిస్తోంది.

రసాయనాల తీవ్రత వల్లనే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతిని క్యాన్సర్ వంటి వ్యాధులు దాపురిస్తున్నాయి. ఎరువులు, పురుగుల మందుల వాడకంతో భూసారం కూడా దెబ్బతింటోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అధ్యయనం ప్రకారం క్రిమిసంహారక మందుల్లో 80 శాతం వర్ధమాన దేశాలు వినియోగిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల పాలై ఏటా ప్రపంచంలో విషరసాయనాల ప్రభావంతో దాదాపు పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News